
మద్యం తాగేందుకు తీసుకెళ్లి దాడి
ఎమ్మిగనూరురూరల్: మద్యం తాగేందుకు తీసుకెళ్లి వేటకొడవలితో దాడి చేశారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో బాధిత వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే..
కోడుమూరుకు చెందిన ఎరుకుల కృష్ణ కొన్ని రోజులుగా గోనెగండ్లలో భార్య సుజాత దగ్గరే ఉంటున్నారు. ఆటో పెట్టుకొని గుజిరి వ్యాపారం చే స్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం కోడుమూరులోని తన ఇంటి పక్కనే ఉన్న బోయ రాములమ్మ అనే మహిళతో చెత్త విషయంలో కృష్ణ గొడవ పడ్డాడు.ఒకరికొకరు కోడుమూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయాన్ని బోయరాములమ్మ తన కుమారుడైన బోయ ఠాగూర్‌కు తెలియజేసింది. దీనిని మనస్సులో పెట్టుకున్న అతను సోమవారం రాత్రి గోనెగండ్లకెళ్లి ఎరుకుల కృష్ణను కలిశాడు. మద్యం తాగుదామని చెప్పి గోనెగండ్ల–రాళ్లదొడ్డి గ్రామాల మధ్య ఉన్న కాలువ గట్టు వద్దకెళ్లారు. మద్యం తాగిన తర్వాత తన తల్లితో ఎందుకు గొడవపడ్డావని వాదనకు దిగి వెంట తెచ్చుకున్న వేటకొడవలితో కృష్ణపై దాడి చేశాడు. అతను ఎదురు దాడికి దిగడంతో ఠాగూర్ అక్కడి నుంచి పారిపోయాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన కృష్ణ మార్గమధ్యంలో కాలువ గుంతలో పడిపోయాడు. మంగళవారం ఉదయం మెలకువ రావడంతో జరిగిన విషయాన్ని ఎమ్మిగనూరు రూరల్ పోలీసులకు తెలియజేయగా వారు మొదట చికిత్స నిమిత్తం కృష్ణను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడిపై అట్రాసిటీ కేసుతో పాటు, హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.