
వ్యర్థ కాలుష్యాన్ని నివారిద్దాం
● ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య
బేతంచెర్ల: పరిశ్రమలు, గనుల నుంచి వెలువడే వ్యర్థ కాలుష్యాన్ని నివారించేందుకు అందరూ సహకరించాలని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని అయ్యల చెర్వులో నాపరాళ్ల పరిశ్రమల యజమానులు, సిమెంట్ ఫ్యాక్టరీ యాజమానాల్యతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాపరాళ్ల గనుల యజమానులు ఒక క్లస్టర్‌గా ఏర్పడి దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోగా క్లస్టర్ ఈసీల మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. నాపరాళ్ల గనుల ఈసీల సమస్యలతో పాటు, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను సిమెంట్ పరిశ్రమలో ఉపయోగించుకునే విధానంపై చర్చించారు. నాపరాళ్ల పరిశ్రమల వేస్టేజీని పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ మాత్రమే వాడుకుంటామని తెలపగా, మహా సిమెంట్, జిందాల్, రామ్‌కో సిమెంట్ యాజమాన్యాలు తమకు వాడుకోవడానికి వీలుపడదని స్పష్టం చేశాయి. బేతంచెర్ల నాపరాళ్ల పరిశ్రమల యజమానులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నంద్యాల ఏజీ మైన్స్ అధికారి శ్రీనివాస్, పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు.