
వైభవంగా తిరువాడిప్పూరం ఉత్సవం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో తిరువాడిప్పూరం ఉత్సవం వైభవంగా నిర్వహించారు. సోమవారం వేకువ జామునే దిగువ అహోబిలంలో కొలువైన మూలవిరాట్ శాంతమూర్తి శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్ల్లతో పాటు గోదాదేవి అమ్మవార్లను సుప్రభాతసేవతో మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గర్భగుడి ఎదురుగా ఏర్పాటు చేసిన యాగశాలలో ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రహ్లాదవరదస్వాములను, గోదాదేవి అమ్మవారికి ఎదురుగా కొలువుంచారు. వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య నవకలశ స్థాపన, అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టువస్త్రాలు, మేనిమి ఆభరణాలతో అలంకరించి కొలువుంచా రు. రాత్రి స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన అద్దాల మండపంలో శ్రీ గోదాదేవి, ప్రహ్లాదవరదుల కల్యాణం నిర్వహించారు. ఆ తర్వాత పల్లకీలో కొలువుంచి గ్రామోత్సవం చేపట్టారు. ముద్రకర్త కీడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యానారాయణ్, అర్చకులు ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించారు.

వైభవంగా తిరువాడిప్పూరం ఉత్సవం