
పేదల బతుకుల్లో వెలుగులు నింపుదాం
నంద్యాల: జిల్లాలో పేదరిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. శుక్రవారం సీఎం చంద్రబాబు అమరావతి సచివాలయం నుంచి పీ4పై జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, జిల్లాధికారులు హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పేదరిక నిర్మూలనకు సంపన్నులందరూ ముందుకు వచ్చి బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలన్నారు. పీ4 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అత్యుత్తమ విధానాలను జిల్లా అంతట అమలు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో కార్పొరేట్ సంస్థలు కూడా కలిసి వచ్చేలా చూడాలన్నారు. అధికారులు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఆ ప్రాంతానికి చెందిన ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు స్థానిక బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలన్నారు. బంగారు కుటుంబాల అత్యంత ప్రాధాన్యతలపై చేపట్టిన సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో బంగారు కుటుంబాలు, మార్గదర్శుల వివరాలు సరిగ్గా నమోదు చేసినప్పుడే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందన్నారు. ఆగస్టు 15 నాటికి జిల్లాలో బంగారు కుటుంబాలను ‘మార్గదర్శులు’ దత్తత తీసుకునే కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి