
మెడికల్ కళాశాలలో వసతుల కల్పనకు చర్యలు
గోస్పాడు: మెడికల్ కళాశాలలో అవసరమైన వసతుల కల్పనకు చర్యలు చేపడతామని అడిషనల్ డీఎంఈ డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఆయన జిల్లా ఆసుపత్రి, మెడికల్ కళాశాల ఆవరణాన్ని పరిశీలించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని సమావేశ భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో ఈ ఏడాది మూడవ సంవత్సరం విద్యార్థులు రానున్నారని వారికి వసతులు కల్పించేందుకు మరిన్ని భవనాలు అవసరమవుతాయన్నారు. ప్రస్తుతం 450 బెడ్లు ఉండగా 620 బెడ్లు అవసరమవుతుందని, వీటితో పాటు ప్రత్యేక క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరు కాగా ఏర్పాటుకు నూతన భవనాలు అవసరమన్నారు. ఆసుపత్రి వద్ద పారిశుద్ధ్య పనులు, సెక్యూరిటీ సేవలు మెరుగుపరచాలన్నారు. 24 గంటల పాటు ఆపరేషన్ థియేటర్‌లో ఆపరేషన్లు నిర్వహణ, అత్యవసర విభాగంలో సేవలు అందించాలన్నారు. మెడికల్ కళాశాల వద్ద నిర్మాణంలో ఉన్న రెండు హాస్టల్, కళాశాల భవనాలు కూడా వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయా విభాగాల వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి ఏఏ విభాగాల్లో ఎలాంటి వసతులు ఉన్నాయి, ఇంకేమైనా కావాల్సి ఉన్నాయా, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీటన్నింటిపై నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి, ప్రిన్సిపాల్ డాక్టర్ సురేఖ, ఆర్‌ఎంఓ వెంకటేశ్వర్లు, ఆయా విభాగాల హెచ్‌ఓడీలు, ప్రొఫెసర్లు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.