
నేర నియంత్రణకు పకడ్బందీ నిఘా
నంద్యాల: నేర నియంత్రణే లక్ష్యంగా పకడ్బందీగా నిఘా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా డ్రోన్ కెమెరా ఆపరేటర్లకు సూచించారు. గురువారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని అన్ని సబ్ డివిజన్‌లలో శిక్షణ పొందిన డ్రోన్ ఆపరేటర్లతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధునిక టెక్నాలజీతో విధులలో నైపుణ్యాన్ని ఏ విధంగా పెంచుకోవాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలీసు అధికారులు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పండగలు, ఊరేగింపులు, ధర్నాల సమయంలో, ఈవ్ టీజింగ్, ట్రాఫిక్, నేర నియంత్రణ, ప్రకృతి విపత్తులలో, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచాలని, ఏదైనా నేర నియంత్రణే లక్ష్యంగా పని చేయాలన్నారు. వివిధ నేరాల్లో నిందితులు తప్పించుకునేందుకు వీలు లేకుండా దర్యాప్తు అధికారులకు సహాయపడేలా వీడియోలు, పొటోలు చిత్రీకరించాలన్నారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రతిరోజు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిల్లో నిర్వహించే విజిబుల్ పోలీసింగ్‌లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ అదిరాజ్‌సింగ్‌రాణా