
సాగుపై తగ్గిన మమ‘కారం’
తీవ్ర నష్టం వచ్చింది
ఎకరా రూ. 37 వేలు కౌలు చెల్లించి రెండు ఎకరాల కౌలు పొలంతోపాటు మరో రెండు ఎకరాల సొంత పొలంలో మిరప సాగు చేశాను. ఎకరాకు 7 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. గతేడాది మిరప సాగుతో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఎకరాకు రూ. లక్ష వరకు నష్టం వాటిల్లింది. మిరప సాగుతో తీవ్ర నష్టాలు రావడంతో ఈ ఏడాది మిరప సాగుకు స్వస్తి చెప్పి ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించాను.
– మోహన్‌రెడ్డి, రైతు, కంపమల్ల,
కోవెలకుంట్ల మండలం
దిగుబడులు అమ్ముకోలేదు
గతేడాది ఒకటిన్నర ఎకరా సొంత పొలంతోపాటు ఎకరా రూ. 20 వేలు కౌలు చెల్లించి మరో మూడు ఎకరాలు తీసు కుని మిరప సాగు చేశాను. ఎకరాకు రూ. 1.50 లక్షలు పెట్టుబడి వచ్చింది. వాతావరణం అను కూలించక ఎకరాకు 12 క్వింటాళ్లకు మించి దిగబడు లు రాలేదు. మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆరు నెలల నుంచి దిగుబడులను కోల్డ్‌స్టోరేజిలో భద్ర పరుచుకున్నాను. ఇప్పటి వరకు అమ్మలేదు. ప్రస్తుత మార్కెట్‌లో క్వింటా రూ. 8 వేలకు మించి పలకడం లేదు. – రామసుబ్బయ్య, రైతు, అమడాల,
కోవెలకుంట్ల మండలం
కోవెలకుంట్ల: వాతావరణం అనుకూలించక, రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఇవ్వక రైతులు ఈ ఏడాది మిరప సాగు చేయలేదు. పెట్టుబడి ఖర్చులు పెరగడం, మార్కెట్‌లో గిట్టుబాటు ధర దక్కకపోవడంతో మిరపకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకున్నారు. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది 12,715 హెక్టార్లలో మిరప సాగు లక్ష్యం కాగా... ఇప్పటి వరకు రైతులు సాగుపై ఆసక్తి కనబరచలేదు.
రైతు కంట్లో ‘కారం’
గతేడాది మిర్చి సాగు రైతుల కళ్లలో కారం కొట్టింది. జిల్లాలోని ఒక్క బనగానపల్లె నియోజకవర్గంలో 4,790 హెక్టార్లలో మిరప సాగు కావాల్సి ఉండగా 3,588 హెక్టార్లలో సాగైంది. మిగిలిన అన్ని మండలాలను కలుపుకుని 4,800 హెకాక్టర్లలో మాత్రమే సాగు చేయగలిగారు. మిరప నారు, నాట్లు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, సాగునీరు మళ్లింపు.. తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 2 లక్షలకు పైగా ఖర్చు చేశారు. కౌలు రైతులకు రూ. 60 వేలు అదనపు భారం పడింది. గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో మిరపను తెగుళ్లు ఆశించాయి. ఎకరాకు 20 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు చవి రూడాల్సి వచ్చింది. దిగుబడులు తగ్గడానికి తోడు మార్కెట్‌లో మిరపకు గిట్టుబాటు ధర భారీగా పడిపోయింది. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టినా క్వింటా రూ. 10 వేలకు మించి ధర పలకపోవడంతో ఆ ధరకే విక్రయించి నష్టాలు మూటగట్టుకున్నారు.
నష్టాల దిగుబడి
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు మిర్చి ఎర్ర బంగారం అయ్యింది. 2021–22, 2022–23 సంవత్సరాల్లో క్వింటా ఎండు మిరపకాయలు రూ. 25 వేల నుంచి రూ. 30 వేలు ధర పలికాయి. అయితే గతేడాది నుంచి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గతేడాది నవంబర్ నెలలో రూ. 15 వేల నుంచి రూ. 16 వేలు పలుకగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ధర రూ. 10 వేలకు పడిపోయింది. మిర్చికి తెగుళ్లు ఆశించడం, దిగుబడులు గణనీయంగా తగ్గడమేకాకుండా గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎకరాకు రూ. 60 వేల నష్టం వాటిల్లింది. దీంతో ఏడాది మిరప సాగు చేయాలంటే రైతులు భయపడుతున్నారు.
చిరు పంటలపై దృష్టి
ఇటీవలే ఎస్సార్బీసీ, కేసీకెనాల్, కుందూనది, పాలేరు, కుందరవాగుకు నీటిని విడుదల చేశారు. సాగునీరు అందుబాటులో ఉన్నా మిరప సాగు చేసేందుకు రైతులు ఆసక్తి కనబరచడం లేదు. ఈ ఏడాది జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో 5 వేల హెక్టార్లకు మించి మిరప సాగయ్యే సూచనలు లేవని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది మిరపసాగుతో తీవ్రంగా నష్టపోయిన రైతులు ఈ ఏడాది మిరప సాగు చేసేందుకు సాహసం చేయడం లేదు. మిరప స్థానంలో ఇప్పటికే రైతులు అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. మిగిలిన విస్తీర్ణంలో మినుము, జొన్న, పప్పుధాన్యాలు, చిరు పంటల సాగువైపు దృష్టి సారించారు.
జిల్లాలో మిరప సాధారణ సాగు విస్తీర్ణం
సబ్ డివిజన్ సాగు విస్తీర్ణం
(హెక్టార్లలో)
కోవెలకుంట్ల 5,141
నంద్యాల 3,789
నందికొట్కూరు 1,519
ఆళ్లగడ్డ 1,156
ఆత్మకూరు 925
డోన్ 184
కలసిరాని మిరపసాగు
గతేడాది కుదేలైన అన్నదాత
ఎకరాకు రూ.60 వేల వరకు నష్టం
ఈ ఏడాది సాగుకు
ముందుకు రాని రైతులు

సాగుపై తగ్గిన మమ‘కారం’

సాగుపై తగ్గిన మమ‘కారం’