
విరిగిపడిన గాలిమర రెక్క
దేవనకొండ: మండలంలోని కె.వెంకటాపురం గ్రామానికి చెందిన చిన్న కౌలుట్లయ్య అనే రైతు పొలంలో బుధవారం ఉదయం గాలిమర రెక్క ఒకటి విరిగి పడింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల పొలాల వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. సదరు కంపెనీ వారికి సమాచారం అందించారు. గాలిమర రెక్క విరిగి పడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
గుర్తు తెలియని మహిళ మృతి
మంత్రాలయం రూరల్: మంత్రాలయంలోని తుంగభద్ర నదిలో పుష్కర ఘాట్, సంతమార్కెట్ ఘాట్ మధ్యలో గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైంది. బుధవారం ఉదయం పుష్కర ఘాట్ వైపు తుంగభద్ర నది వద్ద స్నానానికి వెళ్లిన భక్తులు నదిలో కొట్టుకొస్తున్న మహిళ శవాన్ని గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మహిళ శవాన్ని ఒడ్డుకు చేర్చారు. ఆమె వయసు 55 ఏళ్లు ఉంటుందని, లైట్ గ్రీన్ కలర్ శారీ ధరించి ఉన్నట్లు చెప్పారు. స్థానిక వీఆర్వో భీమయ్య ఫిర్యాదు మేరకు మంత్రాలయం ఎస్‌ఐ శివాంజల్ కేసు నమోదు చేశారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు మంత్రాలయం సీఐ 91211 01151, ఎస్‌ఐ 91211 01152 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు.
క్యాంపస్ సేఫ్ స్పెషల్ డ్రైవ్
కర్నూలు(న్యూటౌన్): విద్యాసంస్థల వద్ద 100 గజాల దూరంలో సిగరెట్, పొగాకు సంబంధిత ఉత్పత్తులు విక్రయించడాన్ని నిషేధించారని, దీనిపై ‘ఆపరేషన్ క్యాంపస్ సేఫ్ జోన్’ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా పోలీసు అధికారులు తమ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలను సందర్శించి 100 గజాలలోపు ఉన్న టీ, పాన్, కిరాణం షాపులలో సిగరెట్లు, ఖైనీ, గుట్కా పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించినట్లు నిర్వాహకులకు తెలియజేశారు. జిల్లాలోని కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు సబ్ డివిజన్‌లలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని విద్యాసంస్థల వద్ద తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థల వద్ద పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న 1441 షాపుల యజమానులపై సీఓటీపీఏ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి రూ.2,24,310 జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘించి పొగాకు ఉత్పత్తులు, గుట్కా విక్రయిస్తే షాపులను సీజ్ చేసి యజమానులపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విరిగిపడిన గాలిమర రెక్క

విరిగిపడిన గాలిమర రెక్క