
ఏపీ జలాలపై వివాదం సృష్టిస్తున్నారు
కర్నూలు కల్చరల్: ఏపీ జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వివాదాలు సృష్టిస్తోంది. రాయలసీమ రైతులు భూములు త్యాగం చేసి కూడా నీరు వాడుకోలేని పరిస్థితి నెలకొంది. పెండింగ్ ప్రాజెక్టులు, బానకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం దారుణమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం కర్నూలులో మాట్లాడుతూ.. బీజేపీ బలోపేతం కోసం పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మాధవ్ జిల్లాల పర్యటనను ప్రారంభిస్తున్నారన్నారు. వైఎస్సార్ కడప జిల్లా నుంచి పర్యటన ప్రాంరభమవుతుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు. టీటీడీలో పనిచేసే అన్యమతస్తులు స్వచ్ఛందంగా వైదొలగాలని కోరారు. అక్రమంగా ప్రాజెక్టులు నిర్మించిన తెలంగాణ సముద్రంలోకి వెళ్లే జలాలను తాము వాడుకుంటామంటే వివాదం సృష్టిస్తోందని వాపోయారు. ఆంఽధ్ర ప్రజల నోట్లో మట్టికొట్టడానికే తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులపై కేంద్రానికి లేఖ రాసిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పులు కప్పి పుచ్చుకోవడానికే సెంటిమెంట్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఈ నెల 28న నంద్యాల, 29న కర్నూలు జిల్లాల్లో పర్యటిస్తారని వెల్లడించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, జిల్లా ఇన్‌చార్జ్ అంకాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రామస్వామి, పురుషోత్తం రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి నిధులతో పశువుల షెడ్లు
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో 2025–26 సంవత్సరంలో కూడా పశువుల షెడ్లు నిర్మించనున్నట్లు జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో జాబ్ కార్డుతో పాటు పశువులు కలిగిన ప్రతి రైతు షెడ్డు నిర్మించుకోవచ్చన్నారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు 1200, నంద్యాల జిల్లాకు 850 పశువుల షెడ్లు మంజూరయ్యాయన్నారు. 2, 4, 6 పశువులకు షెడ్లు నిర్మించుకోవచ్చని.. 90 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. పశుసంవర్థక శాఖ లబ్ధిదారులను ఎంపిక చేస్తుందన్నారు.