
కుటుంబంలో మద్యం చిచ్చు
● ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
బనగానపల్లె: పచ్చని కుటుంబంలో మద్యం చిచ్చు రేపింది. దంపతుల మధ్య కలహాలకు కారణమై కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తిని బలితీసుకుంది. వివరాలు.. మండలంలోని యాగంటిపల్లె గ్రామానికి చెందిన బోయ శ్రీనివాసులు (35)కుటుంబ కలహాలతో మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్ కథనం మేరకు.. బోయ శ్రీనివాసులు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆటో కొనుగోలుకు గతంలో అప్పు చేశాడు. ఈ క్రమంలో కొంతకాలంగా మద్యానికి బానిసై డబ్బంతా తాగుడుకు ఖర్చు చేసేవాడు. మద్యం అలవాటు మానుకొని అప్పులు తీర్చాలంటూ భార్య కళావతి భర్తతో గొడవ పడేది. భర్త తీరు మారకపోవడంతో కొద్దిరోజుల క్రితం పుట్టినిళ్లు ప్యాపిలికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాసులు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శ్రీనివాసులుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
లింక్ నొక్కితే బ్యాంకు
ఖాతా ఖాళీ
కోసిగి: మండల పరిధిలోని ఆర్లబండ గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ బ్యాంకు ఖాతాలోని డబ్బు ను సైబర్ ముఠా దోచేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే పెనాల్టీ, ప్రాసెసింగ్ ఫీజు వంటివి ఉండవని పేర్కొంటూ ఇటీవల అతని సెల్‌ఫోన్‌కు ఒక లింక్ వచ్చింది. ఆ లింక్‌ను ఓపెన్ చేయగా సాయంత్రంలోగా అతని ఖాతాలో ఉన్న రూ.18,500 నగదు మాయమైంది. ఘటనపై బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బుధవారం బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు ఖాళీ అయిన దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో చూపుతూ సైబర్ నేరాలు పెరిగి పోయాయని, వాటిని అరికట్టాలని వాపోయారు.