
తపాలా శాఖలో బీమా ఏజెంటు పోస్టులు
కర్నూలు (న్యూటౌన్): తపాలా శాఖలో భాగమైన తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా డైరెక్ట్ ఏజెంట్లుగా కర్నూలు డివిజన్‌లో పనిచేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తపాలా శాఖ సూపరింటెండెంట్ జి.జనార్ధన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు కొండారెడ్డి బురుజు వద్ద తపాలా శాఖ సూపరింటెండెంట్ కార్యాలయానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. 10వ తరగతి/ఆపై విద్యార్హత ఉండాలని, ఎంపికై న వారు సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.5 వేలు ఎన్‌ఎస్‌సీ రూపంలో చెల్లిస్తే తిరిగి వాపసు ఇస్తారని స్పష్టం చేశారు. ఎంపికై న పాలసీకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కమీషన్ చెల్లిస్తారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఫోన్ నంబర్ 70130 29312ను కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలని సూచించారు.
యాస్పిరేషనల్ బ్లాక్‌లకు అవార్డులు
కర్నూలు(సెంట్రల్): సంపూర్ణ స్థాయిలో అభివృద్ధి సాధించిన యాస్పిరేషనల్ బ్లాక్‌లకు అవార్డులు అందించనున్నట్లు నీతి అయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యాస్పిరేషనల్ బ్లాక్‌ల అభివృద్ధిపై కలెక్టర్లతో సమీక్షించారు. జూలై 28 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు జరుగనున్న సంపూర్ణత అభియాన్ సమ్మార్ సమా రోహ్ గురించి వివరించారు. నిర్ధేశించిన ఆరు సూచికలు సాధించిన జిల్లాలకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో గవర్నర్, ప్రజాప్రతినిధుల సమ క్షంలో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని వి వరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రంజిత్‌బాషా, సీపీఓ హిమప్రభాకరరాజు పాల్గొన్నారు.
కొత్త పింఛన్లు వెంటనే మంజూరు చేయాలి
కర్నూలు(సెంట్రల్): అర్హులైన వారికి వెంటనే కొత్త పింఛన్లు మంజూరుచేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, అబ్దుల్లా డిమాండ్ చేశారు. వారు సోమవారం డీవైఎఫ్‌ఐ కార్యాలయంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్కటి కూడా కొత్త పింఛన్ మంజూరు చేయలేదన్నారు. ఫలితంగా అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రకాష్, విశ్వనాథ్, గోవర్ధన్, సాయి, కిరణ్, రఫీ పాల్గొన్నారు.

తపాలా శాఖలో బీమా ఏజెంటు పోస్టులు