శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శ నానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువ జామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి క్యూ లైన్లలో బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండి పోయాయి. వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు దేవస్థాన అధికారులు పంపిణీ చేశారు. భక్తుల శివ నామ స్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి.
కామేశ్వరీదేవికి సారె
మహానంది: మహానంది క్షేత్రంలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు ఆదివారం పుట్టింటి పట్టుచీర, సారె సమర్పించారు. కోలాటాలు, భజనలతో మహానందికి వచ్చిన శోభాయాత్రకు ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, అర్చకులు స్వాగ తం పలికారు. ఈ మేరకు వారు ఆలయానికి చేరుకుని మహానందీశ్వరుడికి పట్టువస్త్రాలు, కామేశ్వరీదేవికి చీర, సారె అందజేశారు. మాడ వీధుల్లో చేపట్టిన కోలాటాలు, భజనలు, నృత్యాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించాయి. కార్యక్రమాల్లో ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్‌రెడ్డి, ట్రస్ట్ వ్యవస్థాపకులు వేమిరెడ్డి ధనుంజయరెడ్డి, అధ్యక్షుడు శ్రీకాంత్, ఆర్గనైజర్ శివమ్మ, సభ్యులు పాల్గొన్నారు.
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించాలన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తులను ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవడంతో పాటు తమ అర్జీలను కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు
ఆత్మకూరు: పట్టణంలో నూతనంగా డీఎల్‌డీవో, డీఎల్‌పీవో కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు జెడ్పీఈ సీఈఓ నాసరరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆత్మకూరు పట్టణానికి చేరుకున్న ఆయన స్థానిక ఎంపీడీఓ, సెరికల్చర్ కార్యాలయాలను పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ ఉమ్మర్, పంచాయతీరాజ్ ఏఈ సుబ్బయ్య, ఇంజినీరింగ్ అసిస్టెంట్ వినోద్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
మహిళా జెడ్పీటీసీ సభ్యులకు 22 నుంచి శిక్షణ
కర్నూలు (అర్బన్): ఉమ్మడి జిల్లాలోని మహిళా జెడ్పీటీసీ సభ్యులకు ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు డీపీఆర్‌సీ ప్రిన్సిపల్, జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. మార్పు ద్వారా విజేతలు – సాధికారతతో సుపరిపాలన సాధ్యం’ అనే అంశంపై ఈ శిక్షణను జెడ్పీ ప్రాంగణంలోని డీపీఆర్‌సీ భవనంలో ఇవ్వనున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమానికి మహిళా జెడ్పీటీసీ సభ్యులందరూ తప్పక హాజరుకావాలని కోరారు.
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు