
ఆరు నెలల్లో రూ.1.30 కోట్లు
● ఇదీ మద్యం బాబులు చెల్లించిన జరిమానా ● డ్రంకెన్ డ్రైవ్‌లో ఈ ఏడాది 4,123 మందిపై కేసులు నమోదు
కర్నూలు: మద్యం బాబులు ఆరు నెలల్లో అక్షరాలా రూ.1.30 కోట్లు జరిమానా రూపంలో ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీధికో మద్యం దుకాణం... అడుగుకో బెల్టు షాపును ఏర్పాటు చేసి ప్రజల ఒళ్లు, ఇళ్లను గుల్ల చేస్తోంది. మనిషి బలహీనతను ఆసరాగా చేసుకుని మద్యాన్ని వాడవాడలా ఏరులై పారిస్తోంది. చాలామంది యువకులు మద్యం మత్తులో వాహనాలు తోలుతూ కొందరు డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడుతుండగా, మరికొందరు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో పాటు డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో కూడా జరిమానా రూపంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతోంది. గత ఆరు నెలల్లో జిల్లాలో 4,123 మంది డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడగా వారిపై కేసులు నమోదు చేసి పోలీసులు కోర్టులో హాజరుపర్చగా అక్షరాలా రూ.1.30 కోట్లు జరిమానా రూపంలో చెల్లించారు.
మద్యం బాబులపై నెలవారీగా
నమోదైన కేసులు
జనవరి 142
ఫిబ్రవరి 1011
మార్చి 694
ఏప్రిల్ 756
మే 636
జూన్ 884
మొత్తం 4123