
12 నుంచి ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ మొదటి, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని డీఆర్‌ఓ చాంబర్‌లో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ పరీక్షలు ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటలకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయన్నారు. ఇందుకోసం మొత్తం 42 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(అర్బన్): డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఓబులేసు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరిలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. టెట్ అర్హత సాధించిన అభ్యర్థులే సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా వెనుకబడిన తరగతులు, సాధికారత అధికారి కార్యాలయంలో దరఖాస్తులు పొంది అక్కడే సమర్పించాలని తెలిపారు. దరఖాస్తుతో పాటుగా విద్యాఅర్హత, క్యాస్ట్, ఇన్‌కం, ఆధార్, టెట్ హాల్‌టికెట్, టెట్ మార్కిలిస్ట్ జిరాక్స్ కాపీలను జతపరచాలన్నారు.
శ్రీశైలంలో భద్రత కట్టుదిట్టం
శ్రీశైలంప్రాజెక్ట్: భక్తులతో నిత్యం రద్దీగా ఉండే శ్రీశైల క్షేత్రంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సాక్షిగణపతి, హఠకేశ్వరం, ఫాలధార–పంచధార, శిఖరేశ్వరం తదితర ప్రాంతాల్లో నిత్యం పోలీసులు బందోబస్తు ఉండే ఏర్పాట్లు చేశారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో శ్రీశైలంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. శ్రీశైలంలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని ముఖద్వారం వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో, స్వంత వాహనాల్లో, కాలినడకన వచ్చే భక్తులను,ల గేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంయి దేవస్థానం టోల్‌గేట్ వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దేవస్థాన సెక్యూరిటీ సిబ్బందికి పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు.

12 నుంచి ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు