
రైతులకు డీనోటిఫై పత్రాలు
నంద్యాల(న్యూటౌన్): చుక్కల, 22ఏ1 కింద నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించి 11 మంది రైతులకు డీనోటిఫై పత్రాలను ఇచ్చామని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. మొత్తం 11 మంది రైతులకు 32.71 ఎకరాల భూములకు డీ నోటిఫై పత్రాలు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు, ఆర్డీఓలు కృషి చేశారన్నారు. బాధిత సర్వే నంబర్ల రైతులను ఐజీఆర్‌ఎస్ నిషేధిత జాబితాలో డీనోటిఫై చేయాలని, వెబ్ ల్యాండ్ పోర్టల్‌లో మార్పుకు చర్యలు తీసుకోవాలన్నారు.
మలేరియా, డెంగీ రాకుండా పటిష్ట చర్యలు
గోస్పాడు: మలేరియా, డెంగీ వ్యాధులు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య సిబ్బందిని డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటరమణ ఆదేశించారు. పట్టణంలోని తన కార్యాలయంలో సోమవారం నంద్యాల జిల్లా సబ్ యూనియన్ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంఅండ్‌హెచ్‌ఓ మాట్లాడుతూ.. జ్వరం కేసులను త్వరగా గుర్తించి రక్తనమూనాల సేకరించి మలేరియా నిర్ధారణ అయితే వెంటనే ఏఎల్‌ఓ, పోగింగ్ స్ప్రేయింగ్ నివారణ చర్యలు చేపట్టాలన్నారు. మలేరియా, డెంగీ నివారణ చర్యలపై ఏఎన్‌ఎం, ఆశా, సీహెచ్‌ఓలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా మలేరియా అధికారి కామేశ్వరరావు, ఇన్‌చార్జి ఏఎంఓ రామవిజయారెడ్డి, సబ్ యూనిట్ అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ నిర్ణయాలతో
పాఠశాల విద్యకు నష్టం
నంద్యాల(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పాఠశాల విద్యకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని ఏపీటీఎఫ్(275) జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ, ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ ప్రియదర్శినికి అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నాయకులు తిమ్మారెడ్డి, రమేష్, నాగేంద్ర, ప్రసాద్, నౌమాన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
హంద్రీనీవా ఎస్‌ఈగా
పాండురంగయ్య
కర్నూలు సిటీ: హంద్రీనీవా సుజల స్రవంతి పథకం సర్కిల్–1 పర్యవేక్షక ఇంజనీర్‌గా పాండురంగయ్యను నియమిస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎల్‌ఎల్‌సీ ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్‌గా పాండురంగయ్య పని చేస్తున్నారు. హంద్రీనీవా సర్కిల్–1కి రెగ్యులర్ ఎస్‌ఈ లేరు. గత నెల 30న ఇన్‌చార్జిగా ఉన్న సురేష్ పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం హంద్రీనీవా విస్తరణ పనులు జరుగుతుండడంతో ఖాళీగా ఉన్న ఎస్‌ఈ పోస్టుకు పాండురంగయ్యను నియమించారు.
● కర్నూలు సర్కిల్ ఎస్‌ఈగా బాల చంద్రారెడ్డిని నియమించారు. ఈ ఏడాది జనవరి నెల లో రెగ్యులర్ ఎస్‌ఈలుగా పదోన్నతులు ఇవ్వడంతో ద్వారకనాథ్ రెడ్డి ఎస్‌ఈగా బాధ్యతలు స్వీకరించారు. గత నెల 30న పదవీ విరమణ పొందారు. ఖాళీగా ఉన్న ఈ స్థానంలో బాల చంద్రారెడ్డిని ఎస్‌ఈగా నియమితలయ్యారు.

రైతులకు డీనోటిఫై పత్రాలు

రైతులకు డీనోటిఫై పత్రాలు