గోరుకల్లు పెండింగ్ పనులు పూర్తి చేయాలి
పాణ్యం: రాయలసీమకు గుండెకాయగా భావించే గోరుకల్లు జలాశయం పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి, ఆయకట్టు రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం ఎస్సార్బీసీ ఆయకట్టు సాధన సమితి నాయకులు, ఆయకట్టు రైతులు, ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా బొజ్జ దశరథరామిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమకు తాగు, సాగునీటిని అందించే ప్రాజెక్టులలో గోరుకల్లు జలాశయం కీలకమైందన్నారు. అలాంటి ప్రాజెక్టు అసంపూర్తి పనులతో ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 12.44 టీఎంసీలు కాగా కేవలం 11 టీఎంసీలకే పరిమితమైందన్నారు. వరద జలాలను నిల్వ చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కళ్ల ముందు వరద నీరు సముద్రం పాలవుతున్నా పాలకులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభు త్వం తక్షణమే గోరుకల్లు పెండింగ్ పనులు పూర్తి చేసి రైతులు, ప్రజల్లో నెలకొన్న భయాన్ని తొలగించాలన్నారు. రిజర్వాయర్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అనంతరం తహసీల్దార్ నరేంద్రనాథ్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్సార్బీసీ ఆయకట్టు సాధన సమితి నాయకలు మురళీనాథ్‌రెడ్డి, గోపిరెడ్డి, యాగంటి, బసవేశ్వర రైతు సంఘం కన్వీనర్ కొండారెడ్డి, శేషిరెడ్డి, సమాజ్‌పార్టీ నాయకులు శివ కృష్ణయాదవ్, ఏఐఎఫ్‌బీ నాయవకులు వెంకటాద్రి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షులు ప్రతాప్, ప్రసాద్‌రెడ్డి, సీతక్క, సూర్యమహేశ్వరరెడ్డి, ఎరువ రాచంద్రారెడ్డి, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.


