● మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి
ఆత్మకూరురూరల్: అతిసార మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే, శ్రీశైలం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ శిల్పా చక్రపాణిరెడ్డి డిమాండ్ చేశారు. ఆత్మకూరు పట్టణంలో ఇటీవల అతిసార వ్యాధి ప్రబలిన నీలి తొట్ల వీధిలో ఆయన పర్యటించారు. అతిసారంతో మృతి చెందిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలను, బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అతిసారతో మృతి చెందిన రహంతుల్లా, బషిరూన్, నాయక్ కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో అతిసారంతో ముగ్గురు మరణిస్తే ఇప్పటి వరకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇసుక, రేషన్ బియ్యం అక్రమ దందా, మద్యం దుకాణదారులు, రియల్టర్ల నుంచి కమీషన్లు వసూళ్లలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తుందని విమర్శించారు. శిల్పా వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు సయ్యద్ మీర్, రాజమోహన్ రెడ్డి, ముస్తఫా, అంజాద్ అలి, వెంకటస్వామి, సురేష్, రహిమాన్, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.
అధికారులు పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తే సహించం
ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించడం తగదని.. పరిస్థితి ఇలాగే ఉంటే మీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని మాజీ ఎమ్మెల్యే, శిల్పా చక్రపాణి రెడ్డి మున్సిపల్ కమిషనర్ రమేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటి వల్ల అనారోగ్యం పాలై మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన శిల్పా అక్కడే వైద్య శిబిరంలో కూర్చున్న కమిషనర్ రమేష్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. కాలువలోని మురికి నీరు మున్సిపాలిటీ కుళాయిలలోకి వస్తోందని ప్రజలంతా చెబుతుంటే మినరల్ వాటర్ ప్లాంట్‌లపై చర్యలు ఏంటన్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల వాటర్ ప్లాంట్‌ల విషయంలో కావాలనే వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదని, అలాగని పార్టీల ముసుగులో అన్యాయం చేస్తే ఊరుకోబోమన్నారు.