పల్లె కన్నీరు పెడుతుందో..! | - | Sakshi
Sakshi News home page

పల్లె కన్నీరు పెడుతుందో..!

Feb 26 2025 8:26 AM | Updated on Feb 26 2025 8:22 AM

● పనుల్లేక వలసబాట పట్టిన పల్లె వాసులు ● 130 కుటుంబాలకు గాను 10 కుటుంబాలే జీవనం ● మొత్తం ఖాళీ అయిన గ్రామాలు

కొత్తపల్లి: సందడిగా ఉండే గ్రామాలు నేడు వెలవెలబోతున్నాయి. పనుల్లేక ప్రజలంతా కన్నీరు పెడుతూ వలస వెళ్లారు. దీంతో పల్లెలన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కొత్తపల్లి మండలంలో 12 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎర్రమఠం గ్రామ పంచాయతీలో పాత మాడుగుల, కపిలేశ్వరం, సంగమేశ్వరం, సిద్దేశ్వరం, జానాల గూడెం, బలపాలతిప్ప మజరా గ్రామాలు ఉన్నాయి. సిద్దేశ్వరం, జానాల గూడెం, బలపాలతిప్ప గ్రామాల్లో 130 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ అత్యధికంగా చెంచు గిరిజనులు ఉన్నారు. వీరితోపాటు ఎస్సీలు, బీసీలు కూడా జీవిస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రామాల్లో 130 కుటుంబాలకు గాను 10 కుటుంబాలే ఉన్నాయి. ఈ గ్రామాల్లో ప్రజలు సమీపంలోని కృష్ణానదిలో జలాలు ఉన్నప్పుడు చేపల వేట చేస్తారు. నీళ్లు తగ్గుతున్న క్రమంలో కృష్ణానదీ ఒడ్డువెంట బయటపడుతున్న భూముల్లో ఆరుతడి పంటలతో వ్యవసాయం చేసుకొని జీనవనం సాగిస్తున్నారు. ఈ భూములపై 2016లో ఆంక్షలు విధిస్తూ 145 సెక్షన్‌ అమలుచేశారు. ఆ భూముల్లో ఎవరూ వ్యవసాయం చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి నేటి వరకు నీటి ముంపు భూములను ఎవరు సాగుచేయడం లేదు. దీంతో ఆ గ్రామాల ప్రజలందరూ ఉపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్తున్నారు. చాలా మంది పూర్తిగా గ్రామాలను ఖాళీ చేసి బతుకు జీవుడా అంటూ హైదరాబాద్‌కు వెళ్తుంటారు.

కుటుంబ పోషణ భారమై..

వలస వెళ్లడంతో ఇంటికి తాళం వేసిన దృశ్యం

జనాల గూడెం గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌ చాలీచాలని జీతంతో ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంగన్‌వాడీ టీచర్లకు ప్రతినెలా రెండు నుంచి మూడు సమావేశాలు ఉంటున్నాయి. అయితే జానాల గూడెంకు చెందిన అంగన్‌వాడీ టీచర్‌ నియోజకవర్గ సమావేశాలకు వెళ్లాలంటే సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. ఉదయం ఆరు గంటలకు బయలుదేరితే ఇంటికి చేరేలోపు రాత్రి పది గంటలు సమయం అవుతుంది. అలాగే సమావేశాలు ఉన్న రోజున తన భర్త కూలి పనులు వదులుకొని ఆమెతోపాటు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే ప్రత్యేక ఆటోలో వెళ్లాలంటే రాను, పోను వెయ్యి రూపాయల దాకా ఖర్చు అవుతుంది. సమావేశాలకే జీతం మొత్తం ఖర్చు అయి చాలీచాలని జీతంతో కుటుంబ పోషణ భారమై పిల్లల ఉన్నత చదువుల కోసం ఖర్చులకు లేక కుటుంబమంతా కలిసి హైదరాబాద్‌కు ఉపాధి కోసం వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికై న జిల్లా కలెక్టర్‌, ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఉపాధి హామీ పనులు చూపించి వలసలు నివారించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పల్లె కన్నీరు పెడుతుందో..!1
1/1

పల్లె కన్నీరు పెడుతుందో..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement