
ఆలూరు మండలం కోట వీధికి చెందిన పి.చిదానంద తన కుమారుడు వీరన్నకు కడుపు నొప్పి సమస్య ఉందని, ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ వారికి రూ.లక్ష చెక్కును అందజేశారు. దాంతో పాటు కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చేర్చి చికిత్స అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ నరేంద్రనాథ్‌రెడ్డిని ఆదేశించారు. పరీక్షించిన వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. చిన్నపేగు మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని, ఇందుకు దాత అవసరమన్నారు. ఇందుకు కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు వీరన్నకు ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తామన్నారు. అయితే కుటుంబ సభ్యులు దాత లభించినప్పుడు సమాచారం ఇస్తే తామే వీరన్నను తీసుకొస్తామని, అప్పటి వరకు తమ ఇంట్లోనే ఉంచుకుంటామని వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు.