సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరతతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. చాలా కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. లారీలు లేకపోవడంతో కొన్నిచోట్ల కాంటా లు వేయడం లేదు. కాంటాలు వేసినచోట్ల ధాన్యాన్ని నింపి పక్కన పెట్టేస్తున్నారు తప్ప మిల్లులకు తరలించడం లేదు. ఈ పరిస్థితుల్లో రైతులకు అకాల వర్షాల భయం పట్టుకుంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియక తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రాలకు రాని లారీలు
యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోలు కోసం 800 లారీలు అందుబాటులో ఉంచామని పౌరసరఫరాల విభాగం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మూడు నాలుగు రోజులు గడిచినా లారీలు రాని కొనుగోలు కేంద్రాలు చాలా ఉన్నాయి. అడవిదేవులపల్లి మండలం కేంద్రంలోని కొనుగోలు కేంద్రానికి 20 రోజుల్లో కేవలం 17 లారీలే వచ్చాయి. నాలుగు రోజుల క్రితం ఒక లారీ మాత్రమే వచ్చింది. ఆ తరువాత మళ్లీ జాడే లేవు. నిర్వాహకులను అడిగితే లారీలు అందుబాటులో లేవంటున్నారని రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గత్యంతరం లేక సోమవారం రాస్తారోకో చేశారు. దీంతో అధికారులు వచ్చి లారీలను పంపిస్తామన్నారు. కానీ మంగళవారం కూడా ఒక్క లారీ రాలేదు.
459 కేంద్రాల్లో కొనుగోళ్లు
జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో 7 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం మార్కెట్ వస్తుందని అధికారులు అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 459 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వాటిల్లోకి ఇప్పటికే 6.62 లక్షల మెట్రిక్ ధాన్యం మార్కెట్ వచ్చింది. అందులో ఇప్పటి వరకు 3.35 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అందులో 3.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని లారీల ద్వారా మిల్లులకు పంపించామని అధికారులు చెబుతున్నారు. ఒక్కో రైతు నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో వేచి చూస్తున్నారు.
అస్తవ్యస్తంగా కొనుగోళ్లు..
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయి. కొనుగోళ్లు ప్రారంభమై నెల గడిచినా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏ సెంటర్‌లో చూసినా 20 నుంచి నెల రోజులపైగా ధాన్యం అమ్ముకునేందుకు రైతులు వేచి ఉండాల్సి వస్తోంది. ఒక్కో కేంద్రానికి 2 లారీలు కూడా అందుబాటులో ఉండని పరిస్థితి నెలకొంది. అయితే వచ్చిన లారీల యజమానులు మాత్రం మిల్లర్లు ధాన్యం దింపుకోవడం లేదని, అక్కడే వేచి ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం
ఫ మూడు రోజులకోసారి వస్తున్న లారీలు
ఫ సకాలంలో కాంటాలు వేయని సిబ్బంది
ఫ రోజుల తరబడి రైతుల నిరీక్షణ
ఫ లారీలు పంపాలని అడవిదేవులపల్లిలో ధర్నా చేసిన రైతులు


