కనగల్: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కనగల్ మండల కేంద్రంలో రూ.6 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులకు గురువారం ఆయన భూమి పూజ చేశారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తామని తెలిపారు. నల్లగొండలో రూ.150 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మించామని, నర్సింగ్ కళాశాల నిర్మాణం డిసెంబర్ లోపు పూర్తి చేస్తామన్నారు. నల్లగొండ నుంచి దర్వేశిపురం వరకు రూ.50 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. దర్వేశిపురం నుంచి గుర్రంపోడు మీదుగా రూ. 180 కోట్లతో చేపట్టే రోడ్డుకు టెండర్లు పూర్తయ్యాయని, వారం రోజుల్లో పనులు మొదలు పెడతామన్నారు. కనగల్ చౌరస్తా నుంచి అసంపూర్తిగా ఉన్న రహదారిని సరి చేసేందుకు రూ. 8 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రేగట్టె వరకు రూ.60 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం, పగిడిమర్రి మీదుగా ముశంపల్లి వరకు రూ.100 కోట్లతో రోడ్డు మంజూరైందన్నారు. రూ.కోటి 20 లక్షలతో కనగల్ మండల కేంద్రంలో గోడౌన్ ఏర్పాటు, మరో రూ.16 కోట్లతో షెడ్ నిర్మిస్తున్నామని తెలిపారు. అంతకుముందు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దర్వేశిపురంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు శంకర్ నాయక్, కలెక్టర్ చంద్రశేఖర్, నల్లగొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, డీఐఈఓ దశ్రు నాయక్, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, చిట్ల వెంకటేశం గౌడ్, తహసీల్దార్ పద్మ, సర్పంచ్ నర్సింగ్ మురళీధర్ గౌడ్ పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి
వెంకట్‌రెడ్డి


