నల్లగొండ
టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.281.46 కోట్ల బడ్జెట్‌కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. నల్లగొండలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమావేశం మందిరంలో ఆదివారం నిర్వహించిన బడ్జెట్ సమావేశం మేయర్ బుర్రి చైతన్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ చైతన్య ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం, ఖర్చు వివరాలను సభ్యులకు తెలియజేశారు. బడ్జెట్‌పై కార్పొరేటర్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోడంతో బడ్జెట్ ఆమోదిస్తున్నట్లు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి సహకారంతో వచ్చే ఐదేళ్లలో నల్లగొండను స్మార్ట్ సిటీగా తయారు చేయడమే తన ధ్యేయమని మేయర్ చైతన్య పేర్కొన్నారు. పట్టణంలో విద్యుత్ లోవోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు మరో ఐదు సబ్ స్టేషన్ల నిర్మించనున్నామని, శివారు ప్రాంతాల అభివృద్ధికి సుమారు రూ.6.49 కోట్లు కేటాయించామని తెలిపారు. పానగల్ బైపాస్ నుంచి సావర్కర్ నగర్, రామగిరి, క్లాక్‌టవర్‌ల మీదుగా డీఈఓ ఆఫీస్ వరకు రోడ్డు విస్తరణ కోసం మంత్రి కోమటిరెడ్డి చొరవతో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.14.45 కోట్ల నిధులు విడుదలయ్యాయని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, డిప్యూటీ మేయర్ అమేర్, కార్పొరేటర్లు ఇబ్రహీం, కేసాని వేణుగోపాల్‌రెడ్డి, నవీన్‌గౌడ్, అమీనా ఫర్వీన్ సమద్ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న మేయర్ బుర్రి చైతన్య, పాల్గొన్న కార్పొరేటర్లు


