యాదగిరిగుట్ట రూరల్ : బస్వాపురం రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లి నీటిలో మునిగి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన సి. అభిలాష్ (26) ఐకేఈ మెడికల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఉదయం అభిలాష్‌తో పాటు అతడితో పనిచేసే మహిపాల్, రిషి, విజయ్, ప్రశాంత్, శర్మ, అజయ్ కలిసి భువనగిరి పట్టణ పరిధిలోని ఎల్లమ్మ తల్లి ఆలయానికి వచ్చారు. దర్శనం అనంతరం స్నేహితులంతా కలసి సరదాగా కాలక్షేపం చేశారు. ఆ తర్వాత సాయంత్రం భువనగిరి పరిధిలో ఉన్న బస్వాపురం రిజర్వాయర్‌ను సందర్శించడానికి వెళ్లారు. ఈ క్రమంలో లప్పానాయక్ తండా పరిధిలోని దుర్గామాత ఆలయం సమీపంలో ఉన్న ప్రాజెక్టు నీటి వద్దకు వెళ్లారు. అభిలాష్ ఈత కొట్టడానికి నీటిలోకి వెళ్లి మునిగిపోయాడు. గమనించిన తోటి స్నేహితులు అభిలాష్‌ను బయటకు తీసుకొచ్చే లోపే అతడు మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భాస్కర్ తెలిపారు.


