యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వరుస సెలవులు రావడంతో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, శివాలయం, కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపం, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, అన్నసత్ర కేంద్ర భవనం, కొండపైన, కొండ కింద ఆర్టీసీ బస్టాండ్ భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి ధర్మ దర్శనానికి మూడున్నర గంటలకు పైగా, వీఐపీ టిక్కెట్ దర్శనానికి గంటన్నర, బ్రేక్ దర్శనానికి అర గంటకు పైగా సమయం పట్టింది. స్వామిని 45వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.57,56,656 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.
ఆకట్టుకున్న నత్య ప్రదర్శన
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని తూర్పు మాడ వీధిలోని సాంస్కృతిక వేదికపై ఆదివారం సాయంత్రం వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారిణులు భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల వైష్ణవి కూచిపూడి కళాక్షేత్రం నిర్వాహకురాలు స్వప్నప్రవీణ్ ఆధ్వర్యంలో విష్ణుజా, విశ్వజా కళాకారిణుల ఆధ్వర్యంలో ఈ నృత్య ప్రదర్శన కొనసాగింది. ఈ నత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.


