గుర్రంపోడు : వేసవిలో మనుషులే కాదు పశువులూ వడదెబ్బకు గురవుతాయి. నిర్లక్ష్యం చేస్తే పశువులు వడదెబ్బతో మృతిచెందే ప్రమాదం ఉంది. వడదెబ్బ నుంచి పశువులను రక్షించుకునేందుకు గుర్రంపోడు మండల పశువైద్యాధికారి సాయిరాం రైతులకు అందిస్తున్న సలహాలు, సూచనలు..
● ఉష్ణోగ్రత పెరిగి గాలిలో తేమ తగ్గినప్పుడు పశువులు ఎక్కువగా వడదెదెబ్బకు గురవుతాయి. గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, పశువులు షెడ్లలో ఎక్కువ సంఖ్యలో పశువులు ఉండటం, నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం, వడగాల్పుల తాకిడికి వడదెబ్బకు గురవుతాయి. తెల్లజాతి కంటె నల్లజాతి పశువులు ఎక్కువగా వడదెబ్బకు గురవుతాయి
● వేసవి కాలంలో బయటి ఉష్ణోగ్రత పశువుల శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువైనప్పుడు మెదడులోని హైపోథాలమస్ స్వేద గ్రంథులపై నియంత్రణ కోల్పోతుంది. దీంతో చర్మంపై గల స్వేద రంధ్రాలు చెమటను అధికంగా విడుదల చేసి శరీరంలోని ఎలక్ట్రోలైట్‌లను కోల్పోయి శరీర పక్రియ మందగిస్తుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శ్వాస, గుండె, నాడీ వేగం పెరుగుతాయి. మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడంతో మూత్ర విసర్జన కుంటుపడుతుంది. పశువుల ఆరోగ్య పరిస్థితి విషమించి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాయి. శ్వాస ఆడక మరణిస్తాయి.
వడదెబ్బ లక్షణాలు
వడదెబ్బ తగిలిన పశువుల శరీర ఉష్ణోగ్రత 103 డిగ్రీల ఫారన్‌హీట్ కంటే ఎక్కువగా ఉంటుంది. చర్మ సున్నితత్వం కోల్పోయి గట్టిపడుతుంది. పశువులు సరిగ్గా నడవలేక తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి. నీడ కోసం చెట్ల కిందకు చేరుతాయి. అధిక దాహం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత 104 ఫారన్‌హీట్ దాటితే శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఫిట్స్ లక్షణాలతో క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణిస్తాయి. శరీర ఉష్ణోగ్రత 109 డిగ్రీలు దాటితే ప్రాణపాయం సంభవిస్తుంది. వడదెబ్బ ప్రభా వం వల్ల చూలు పశువుల్లో గర్భస్రావాలు సంభవిస్తాయి. పశువుల్లో పునురుత్పత్తి పక్రియ కుంటుపడుతుంది. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది.
చికిత్స ఇలా ...
వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే ప్రాంతానికి మార్చాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి తీసుకరావడానకి పలుమార్లు కడగాలి. తాగునీటిని అందుబాటులో ఉంచాలి. వెంటనే పశువైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. వైద్యుల పర్యవేక్షణలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఇంజెక్షక్షన్లు వేయించాలి. రక్తంలోని సైలెన్ ద్వారా గ్లూకోజు, ఎలక్ట్రోరైట్స్ అందిస్తే పశువులు నీరసం నుంచి బయటపడతాయి.
వడదెబ్బ నివారణకు మందస్తు చర్యలు
● వేసవిలో ముఖ్యంగా పశువులను పగటి వేళ మేతకు వదలరాదు. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు పంపాలి. తాగునీరు అన్నివేళలా అందుబాటులో ఉంచాలి. పశువులను రోజకు కనీసం రెండుసార్లు చల్లని నీళ్లతో కడగాలి. చెరువులు, కుంటల్లో ఈదనివ్వాలి.
●గాలి వెలుతురు ప్రసారమయ్యేలా ఎత్తైన కొట్టాలను గడ్డితో నిర్మించాలి. రేకులు ఉంటే మధ్యాహ్నం వేళల్లో వరిగడ్డి పరిచి మధ్యాహ్నం వేళల్లో నీరు చల్లాలి.
● వేసవిలో దాహంతో ఉన్న పశువులు కలుషితం కాకుండా జాగ్రత్త వహించాలి. షెడ్డు పైన వరిగడ్డి వేసి మధ్యాహ్నం వేళ నీరివ్వాలి.
● షెడ్డుల నిర్మాణం తూర్పు, పడమర దిశలలోనే జరగాలి. దీనివల్ల వడగాల్పుల నుంచి తూర్పు, పడమర ఎండల నుంచి రక్షణ లభిస్తుంది.
● పాడి గేదెలకు ఉదయం, సాయంత్రం పాలు పితికేటప్పుడు పొదుగును చల్లని నీటిలో కడగాలి.
● పశువులకు గోమర్లు లేకుండా చూసుకోవాలి.
● పరిశుభ్రమైన నీరు ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలి.


