సూర్యాపేట అర్బన్ : ఇది ఉద్యమనామ సంవత్సరం అని, ప్రజా సమస్యలపై సీపీఐ శ్రేణులు రాజీలేని పోరాటం కొనసాగించేందుకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గడపగడపకు సీపీఐ పేరుతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి పార్టీ కార్యకర్తలు వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలపై దృష్టి సారించాలని, పంటలు ఎండిపోకుండా నీరందించేలా అధికారులతో మాట్లాడాలని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేలా ప్రజలను సమీకరించి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేయాలని కోరారు. కొత్తగా రెండు లక్షల మందికి రేషన్ కార్డులు, మరో రెండు లక్షల మందికి పెన్షన్లు అందిస్తామని ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని, అర్హులైన వారికి ఆ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. ఇటీవల రాష్ట్ర బడ్జెట్‌లో బీసీల సంక్షేమం కోసం కేవలం రూ.12వేల కోట్లు మాత్రమే కేటాయించడం బాధాకరమన్నారు. మే నెలలో కూడా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు జరిగే రాజకీయ శిక్షణ తరగతుల్లో పాల్గొని పార్టీ బలోపేతానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి కంబాల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, యల్లావుల రాములు ధూళిపాళ ధనుంజయనాయుడు, మేకల శ్రీనివాసరావు, యల్లంల యాదగిరి, మండవ వెంకటేశ్వర్లు, బద్దం కృష్ణారెడ్డి, పోకల వెంకటేశ్వర్లు, బత్తినేని హనుమంతరావు, బూర వెంకటేశ్వర్లు, గుండు వెంకటేశ్వర్లు, నంద్యాల రామిరెడ్డి పాల్గొన్నారు
ఫ సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి


