కట్టంగూర్ : కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సేదదీరడానికి స్విమ్మింగ్ పూల్‌కు వచ్చిన మాజీ సైనికుడు అందులో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన కట్టంగూర్ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు బెల్లి జనార్దన్(49) ఆదివారం కట్టంగూర్‌లో తన అత్తగారింటికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. సాయంత్రం సేదదీరడానికి కుటుంబ సభ్యులతో కలిసి ఈదులూరు రోడ్డులో గల ఎంఎస్‌ఆర్ స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లాడు. స్విమింగ్ చేస్తూ నీరు తాగడంతో నీటిలో మునిగిపోయాడు. చాలాసేపటి వరకు బయటకు రాకపోవటంతో గమనించిన బంధువులు, కుటుంబ సభ్యులు జనార్దన్‌ను బయటకు లాగారు. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది వచ్చి సీపీఆర్ చేసినా అప్పటికే అతడు మృతిచెందాడు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో బెల్లి జనార్దన్ మృతదేహంపై ప్రజా గాయని, ఉద్దీపని ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ వేముల పుష్ప పూలమాల వేసి నివాళులర్పించారు.
ఫ స్విమ్మింగ్ పూల్‌లో మునిగి
మాజీ సైనికుడు మృతి
ఫ కట్టంగూర్ మండల కేంద్రంలో ఘటన


