గృహ ప్రవేశాలకు అమావాస్య అడ్డు! | - | Sakshi
Sakshi News home page

గృహ ప్రవేశాలకు అమావాస్య అడ్డు!

Mar 19 2026 8:44 AM | Updated on Mar 19 2026 8:44 AM

ఉగాది రోజున సామూహిక గృహ ప్రవేశాలకు

లబ్ధిదారుల విముఖత

ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించే అవకాశం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఇందిరమ్మ గృహ ప్రవేశాలకు అమావాస్య అడ్డంకిగా మారింది. జిల్లాలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ఉగాది పండుగ రోజైన గురువారం సామూహిక గృహ ప్రవేశాలు చేయించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అయితే అదే రోజు అమవాస్య ఉండడంతో గృహ ప్రవేశాలకు లబ్ధిదారులు ముందుకు రాలేదు. దీంతో సామూహిక గృహ ప్రవేశాలకు బ్రేక్‌ పడింది. అయితే ఆ తరువాత స్థానిక పరిస్థితులను బట్టి, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో గృహ ప్రవేశాలు చేపట్టే అవకాశం ఉంది. లేదా లబ్ధిదారులు ఎవరికివారే గృహ ప్రవేశాలు చేసుకోవాలని అధికారులు సూచించనున్నారు.

99 రోజుల కార్యక్రమంలో 6,409 గృహాలు టార్గెట్‌

‘ప్రజాపాలన ప్రగతి నివేదిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో జూన్‌ 12 నాటికి 6,409 ఇళ్లను పూర్తి చేసి గృహ ప్రవేశాలు పూర్తి చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 1809 గృహాలు పూర్తయ్యాయి. వాటిల్లో ఉగాది పండుగ రోజున గృహ ప్రవేశాలు చేయాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ నిర్ణయించారు. అత్యధిక గృహాలను నిర్మించి రాష్ట్రంలోనే నల్లగొండ రెండో స్థానంలో నిలిచింది. ఉగాది పండుగ అయినప్పటికి అమావాస్య రావడంతో నూతనంగా నిర్మించుకున్న గృహాల ప్రవేశాలకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. దీంతో సామూహిక గృహ ప్రవేశాల ప్రక్రియను వాయిదా వేసుకున్నారు.

కలెక్టర్‌ దృష్టికి తాగునీటి సమస్య

ఇందిరమ్మ ఇళ్ల వద్ద తాగునీటి కష్టాలు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. కలెక్టర్‌ చంద్రశేఖర్‌ బుధవారం కనగల్‌ మండలం తేలకంటివారిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడ ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కాలనీలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, ఎండాకాలం వచ్చినందున సమస్య మరింత ఎక్కువగా ఉందని, తాగునీటి సమస్య తీర్చాలని అక్కడి లబ్ధిదారులు కలెక్టర్‌కు విన్నవించారు. ప్రస్తుతం దూరం నుంచి పైప్‌లైన్లు వేసుకుని నీటిని తెచ్చుకుంటున్నామని చెప్పడంతో గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను పంపించి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ హామీ ఇచ్చారు. మిగతా ప్రాంతాల్లోని ఇళ్ల వద్ద కూడా ఇలాంటి సమస్యలు ఉంటే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement