పాలకవీడు : ప్రకృతి సిద్ధమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా భూసారాన్ని కాపాడుకుంటూ స్థిరమైన దిగుబడులు సాధించవచ్చని గడ్డిపల్లి కేవీకే వ్యవసాయ శాస్త్రవేత్త నరేష్ అన్నారు. ప్రకృతి వ్యవసాయంపై సోమవారం పాలకవీడు మండలం కోమటికుంట గ్రామంలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రముఖ వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్ ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రకృతి వ్యవసాయ విధానాలపై సమగ్రంగా వివరించారు. రసాయన మందులు, పురుగు మందుల వాడకం వల్ల నేల నిస్సారమవడమే కాకుండా పర్యావరణం కూడా దెబ్బతింటోందన్నారు. పాలేకర్ సూచించిన జీవామృతం వంటి సహజసిద్ధ ఎరువులు తయారు చేసుకుని వినియోగించడం వల్ల భూమిలోని సూక్ష్మజీవుల వృద్ధి పెరిగి పంటలకు అవసరమైన పోషకాలు అందుతాయన్నారు. పెట్టుబడి లేని ఈ సాగు విధానం వల్ల రైతులకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందన్నారు. రైతులు రసాయన సేద్యాన్ని విడిచిపెట్టి ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి.కళ్యాణచక్రవర్తి, సర్పంచ్ వడిత్య సునీత, ఇఫ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లు, ఏఈఓ గోపి, కార్యదర్శి నాగలక్ష్మి, రైతులు పాల్గొన్నారు.


