అర ఎకరంలో పన్నెండు పంటలు | - | Sakshi
Sakshi News home page

అర ఎకరంలో పన్నెండు పంటలు

Mar 17 2026 7:29 AM | Updated on Mar 17 2026 7:29 AM

స్వయంగా బండిపై విక్రయిస్తూ..

హనుమంతు చేనులో సస్యరక్షణ చర్యలు, అంతర్‌ కృషిచేస్తుండగా అతడి భార్య మాధవి ప్రతిరోజు ఉదయం కూరగాయలు, ఆకుకూరలను తెంపుకుని తమ చేను సమీపంలో ఉన్న ముసలమ్మచెట్టు గ్రామ స్టేజీ వద్ద బండిపై పెట్టి స్వతహాగా విక్రయిస్తోంది. రోజుకు ఎంతయితే అమ్మకాలు జరుగుతాయో అంతే పరిమాణంలో కూరగాయలు, ఆకుకూరలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో కూరగాయల దుకాణాలకు పోస్తే తక్కువ రేటుకు విక్రయించాల్సి వస్తుంది. అదే నేరుగా తామే విక్రయించుకుంటే కిరాయి ఖర్చులు తగ్గి రెట్టింపు ఆదాయం వస్తుందని వారు తెలిపారు. ప్రస్తుతం రోజుకు అన్నిరకాల కూరగాయలు కలిపి అర క్వింటాల్‌కు పైగానే విక్రయిస్తున్నట్లు హనుమంతు దంపతులు చెబుతున్నారు.

పెద్దవూర: వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పత్తి, మిరప పంటలు సాగు చేస్తే కనీసం పెట్టుబడి కూడా వెళ్లడం లేదు. దీంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అయితే పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామానికి చెందిన రైతు కాశిమళ్ల హనుమంతు, మాధవి దంపతులు మాత్రం గత మూడేళ్లుగా తమకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలోనే పన్నెండు రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు. కూరగాయలు, ఆకుకూరలకు మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. కాశిమళ్ల హనుమంతు తనకున్న వ్యవసాయ భూమిలో ఖరీఫ్‌లో పత్తి, మిరప, కంది పంటలు సాగు చేశాడు. పత్తి పంట చేతికి రాగానే పత్తి కట్టెను తొలగించి 20 నుంచి 30 గుంటల భూమిని కూరగాయలు, ఆకుకూరల సాగుకు కేటాయించి చదును చేశాడు. రెండు గుంటల భూమిలో చిన్నపాటి కర్రలను ఏర్పాటు చేసి తీగ పందిరి ఏర్పాటు చేశాడు. బీర, సొరకాయ, కాకర విత్తనాలు వేసి తీగలకు సుతిలితో పైకి ఎక్కేలా చేశాడు. మిగిలిన భూమిలో టమాట, బెండ, దోస, కాకర, గోరుచిక్కుడు, చిక్కుడు, వంగ వంటి కూరగాయలతో పాటు పాలకూర, గోంగూర, తోటకూర, మెంతికూర, పుదీన, కొత్తిమీర వంటి ఆకుకూరలను సాగు చేస్తూ తక్కువ సమయంలో అధిక లాభాలను ఆర్జిస్తున్నారు.

పెట్టుబడి తక్కువ..

తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వస్తుండటంతో అర ఎకరం పొలంలో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలను సాగు చేశాను. చీడపీడల నివారణకు తప్ప క్రిమిసంహారక మందుల పిచికారీ తక్కువే. రెండు గుంటల భూమిలో ప్లాస్టిక్‌ వైరు, కర్రలతో తీగ పందిరి వేసి బీర, కాకర, సొరకాయలు సాగు చేశాను. వీటికి నీటి వినియోగం కూడా తక్కువే. ఒక్కసారి పాలకూర విత్తనాలు వేస్తే 8 నుంచి 10 సార్లు కోసుకోవచ్చు. నిత్యం ఆదాయం వస్తుంది. – కాళిమళ్ల హనుమంతు

చక్రాల బండిపై విక్రయిస్తున్నా

పండించిన కూరగాయలు, ఆకుకూరలను మార్కెట్‌కు తీసుకెళ్తే తక్కువ రేటుకు అడుగుతున్నారు. దీంతో మా చేను సమీపంలోని ముసలమ్మచెట్టు గ్రామ స్టేజీ వద్దకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చిపోతుంటారు. దీంతో నాలుగు చక్రాల బండిని కొనుగోలు చేసి ఉదయం కూరగాయలు, ఆకుకూరలను తెంపి మధ్యాహ్నం నుంచి నేరుగా విక్రయిస్తున్నాను. దీంతో లాభాలు పొందుతున్నాం. – కాళిమళ్ల మాధవి

కూరగాయలు, ఆకుకూరల పంటలు

సాగుచేస్తున్న దంపతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement