రైతు భరోసాకు ముహూర్తం | - | Sakshi
Sakshi News home page

రైతు భరోసాకు ముహూర్తం

Mar 17 2026 7:29 AM | Updated on Mar 17 2026 7:29 AM

భానుపురి (సూర్యాపేట), నల్లగొండ అగ్రికల్చర్‌, భువనగిరి : యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. సిద్దిపేట జిల్లాలో ఈనెల 22న సీఎం రేవంత్‌రెడ్డి మొదటి విడతగా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. అయితే వానాకాలం సీజన్‌ మాదిరిగా కాకుండా ఈ యాసంగిలో మూడు విడతల్లో రైతులందరికీ రైతు భరోసా సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదట విడతలో ఎకరం భూమి ఉన్న రైతులకు మాత్రమే రూ.6000 చొప్పున జమ చేయనున్నారు. ఆ తర్వాత 20 రోజులకు ఎకరంపై భూమి ఉన్న రైతులకు రెండో విడతలో రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వెల్లడించారు. అనంతరం మరో 20 రోజుల తర్వాత ఏప్రిల్‌ నెలాఖరుకు అర్హులైన రైతులందరికి రైతు భరోసా నిధులను జమ చేయనున్నారు. యాసంగి సీజన్‌ ప్రారంభంలో ఇవ్వాల్సిన ఈ నిధులను చాలా ఆలస్యంగా పంటలు చేతికి వచ్చే దశలో ప్రభుత్వం అందిస్తోంది. వరుస ఎన్నికలు, నిధుల సమస్యతో ఆలస్యం కాగా.. ఇప్పటికై నా నిధుల జమకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మూడు విడతల్లో సాయం

సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 2.70లక్షల మంది రైతులు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 6.19 లక్షల ఎకరాల భూమికి రైతుబంధు నిధులు అందాయి. అయితే అనర్హులకు రైతుభరోసా అందుతుందన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సర్వేలు చేపట్టి సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఈ లెక్కన గత యాసంగిలో సాగు భూములను సర్వే చేయగా.. 7,581 ఎకరాల భూమికి అదనంగా రైతు భరోసా అందుతున్నట్లు గుర్తించారు. వీటికి మినహా ఇతర భూములకు పెట్టుబడి సాయం ఇచ్చింది. అదేవిధంగా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 5,65,803 మంది పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న రైతులున్నారు. వారికి ఎకరానికి 6 వేల చొప్పున రూ.738,67,60,000 ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2.33 లక్షల మంది రైతులు ఉన్నారు. సుమారు 6లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. వారి ఖాతాల్లో రైతు భరోసా కింద సుమారు రూ.300కోట్లు జమకానున్నాయి.

పంట చేతికొచ్చే సమయంలో..

రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం ప్రతీ సీజన్‌లోనూ ఆలస్యంగా రైతుల అకౌంట్లలో జమ చేసింది. యాసంగి సీజన్‌ నవంబర్‌ రెండో వారంలో ప్రారంభమై.. డిసెంబర్‌, జనవరిలో ముమ్మరంగా సాగుతోంది. ఈ సమయంలో రైతులకు పెట్టుబడి సాయం అవసరం అవుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం సీజన్‌లో ముందుగా వేసిన వరి పంట మరో 20 రోజుల్లో చేతికి వచ్చే సమయానికి రైతు భరోసాను అందిస్తోంది.

22వ తేదీ నుంచి మూడు విడతల్లో

రైతుల ఖాతాల్లో జమ

ఎకరాకు రూ.6వేల చొప్పున

ఇవ్వనున్న ప్రభుత్వం

ఆలస్యంగానైనా అందుతున్న

యాసంగి పెట్టుబడి సాయం

ఉమ్మడి జిల్లాలో లబ్ధి పొందనున్న రైతులు..

జిల్లా మొత్తం రైతులు అందనున్న సాయం

నల్లగొండ 5.65లక్షలు రూ.738.67 కోట్లు

సూర్యాపేట 2.70లక్షలు రూ. 366.50 కోట్లు

యాదాద్రి భువనగిరి 2.33లక్షలు రూ.300 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement