నల్లగొండ ఎస్పీని ఆశ్రయించిన ప్రేమ జంట | - | Sakshi
Sakshi News home page

నల్లగొండ ఎస్పీని ఆశ్రయించిన ప్రేమ జంట

Mar 17 2026 7:29 AM | Updated on Mar 17 2026 7:29 AM

నల్లగొండ : ప్రేమ వివాహం చేసుకున్న తమకు రక్షణ కల్పించాలని సోమవారం నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ను ఆయన కార్యాలయంలో ప్రేమ జంట కలిసి విన్నవించారు. నాంపల్లి మండలం స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన మారగోని నాగరాజు, తిరుమని అఖిల గత నెల 26న ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ తల్లిదండ్రులు, బంధువుల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఎస్పీకి విన్నవించారు.

కారు, బైక్‌ దగ్ధం

మోతె : ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి కారు, బైక్‌ దగ్ధమయ్యాయి. వివరాలు.. మోతె మండల పరిధిలోని అన్నారిగూడెం గ్రామానికి చెందిన అంకిరెడ్డి మల్లయ్య ఇంటి ఆవరణలోని పార్కింగ్‌ చేసిన కారు, బైక్‌లో మంటలు చెలరేగి దగ్ధమయ్యాయి. అదేవిధంగా ఇల్లు కూడా దగ్ధమైనట్లు మల్లయ్య కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆటో డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

హాలియా : ఎక్కువ మంది ప్రయాణికులను తరలిస్తున్న ఆటో డ్రైవర్‌ను పోలీసులు ఆపి ప్రశ్నించగా.. పోలీసులను బెదిరించాలని అనుకొని ఆటో డ్రైవర్‌ నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన సోమవారం హాలియా పట్టణంలో జరిగింది. ఎస్‌ఐ సాయి ప్రశాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అనుముల మండలం చల్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కాసుల రమేష్‌(45) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం సాయంత్రం రమేష్‌ తన ఆటోలో నిబంధనలకు విరుద్ధంగా 16 మంది ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తుండగా హాలియాలో పోలీసులు ఆపి ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులను బెదిరించాలని అనుకున్న రమేష్‌ పక్కనే ఉన్న నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు, స్థానికులు కాల్వలో కొట్టుకుపోతున్న రమేష్‌ను బయటకు లాగి అతడి ప్రాణాలు కాపాడారు. ఈ మేరకు రమేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

సాగర్‌ ఎడమ కాల్వలో బాలుడు గల్లంతు

నిడమనూరు : సాగర్‌ ఎడమ కాల్వలో ఈత కొడుతూ బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన నిడమనూరు మండలం బొక్కమంతలపహాడ్‌ గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సఫియా కుటుంబం ఉపాధి నిమిత్తం నిడమనూరు మండలంలోని బొక్కమంతలపహాడ్‌ గ్రామానికి వలస వచ్చి ఉంటున్నారు. సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలోని సాగర్‌ ఎడమ కాల్వ వద్ద సఫియా బట్టలు ఉతుకుతుండగా.. వారి పదమూడేళ్ల కుమారుడు కాల్వలో ఈత కొడుతూ గల్లంతయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మనోవేదనతో

అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ మృతి

కనగల్‌ : అగ్రిగోల్డ్‌ సంస్థలో డిపాజిట్లు చేసిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో.. గతంలో ఆ సంస్థ ఏజెంట్‌గా పనిచేసిన వ్యక్తి ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. కనగల్‌ మండల పరిధిలోని శాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన గంజి లక్ష్మీనారాయణ(65) గతంలో అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌గా పనిచేశాడు. తనకు తెలిసిన వారి నుంచి లక్షల రూపాయలు ఆ సంస్థలో పెట్టుబడి పెట్టించాడు. కొంతకాలానికి ఆ సంస్థ మూతబడటంతో డబ్బులు కట్టిన వారు.. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని లక్ష్మీనారాయణపై కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement