ఆత్మకూరు(ఎం) : భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో భర్త ఆమెను కత్తితో పొడిచాడు. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన గుర్రాల మంజుల కుమార్తె దేవికి, మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామానికి చెందిన వెంపటి మహేష్‌తో 2012లో వివాహం జరిగింది. వీరికి కుమార్తె రేణుక ఉంది. మహేష్ కుటుంబంతో కలిసి బీబీనగర్‌లో ఉంటూ తాపీ మేసీ్త్ర పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దేవి మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని మహేష్ అనుమానం పెంచుకోవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పదిరోజుల క్రితం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వీరి కుమార్తె రేణుక సికింద్రాబాద్‌లో ఉంటున్న మహేష్ తల్లిదండ్రుల వద్ద ఉంటుండడంతో దేవి కూడా అక్కడికి వెళ్లింది. అక్కడి నుంచి ఈ మధ్యనే తన పుట్టిల్లు ఆత్మకూరు(ఎం)కు వచ్చింది. దేవిని తీసుకెళ్లడానికి మహేష్ సోమవారం ఆత్మకూరు(ఎం)కు వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డారు. ఈ క్రమంలో మహేష్ కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో దేవిని విచక్షణారహితంగా పొడిచాడు. చుట్టుపక్కల వాళ్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దేవిని అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దేవి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ హనుమంతు తెలిపారు. ఇదిలా ఉండగా నిందితుడు మహేష్ ఆత్మకూరు(ఎం)పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం.
వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో ఘాతుకం
పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు?


