● ఏడుగురికి గాయాలు
చండూరు : చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఆదివారం రాత్రి యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఏడుగురికి గాయాలయ్యాయి. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చండూరు పట్టణానికి చెందిన దోటి కిరణ్ ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. కిరణ్ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వకుండా పోటీలో నిల్చున్నాడని చండూరులోని శివాలయం యూత్ సభ్యులు అతడిపై కక్ష పెంచుకున్నారు. అంతేకాకుండా ఇటీవల చండూరు మండలం తుమ్మలపల్లి జాతరలో పేకాట ఆడుతున్న కొందరు యువకులను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. దోటి కిరణ్ ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు తమపై కేసులు పెట్టారని భావించిన యువకులు అతడిపై పగ పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కస్తాల ఎక్స్ రోడ్ వద్ద దోటి కిరణ్, మరికొంత మంది యువకులు ఉండగా.. చండూరు శివాలయం యూత్ సభ్యులు కర్రలతో వారిపై దాడి చేశారు. ఈ దాడిలో దోటి కిరణ్, దోటి నరేష్, దోటి శివ, సోమ రాజు, భీమనపల్లి గణేష్, సంగెపు నరేష్, చెరుపల్లి వెంకటేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల ముందుగానే వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని పథకం ప్రకారమే తనపై దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన 16మందిపై దోటి కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
8 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్టలోని పలు హోటళ్లు, టీస్టాల్స్‌లో సివిల్ సప్లయి అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. నిర్వాహకులు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టి 8 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో ఏఎస్‌ఓ సురేష్‌రెడ్డి, సీఎస్ నర్సింగ్‌రావు, ఆర్‌ఐలు విజయసింహారెడ్డి, నర్సింహారెడ్డి, రమేష్ పాల్గొన్నారు.


