నల్లగొండ : గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని మునుగోడు రోడ్డు గణేష్‌నగర్ కాలనీ శ్మశానవాటిక సమీపంలో ఆదివారం కొంతమంది వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నట్లు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి నలుగురిని పట్టుకున్నారు. వారి నుంచి 2 కిలోల గంజాయి, రెండు బైక్‌లు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు మహ్మద్ పుర్ఖాన్, కారింగుల ప్రదీప్, వల్కి వినోద్‌కుమార్, బైరుగొండ నవీన్‌గా గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. వీరు హైదరాబాద్‌లోని ధూల్‌పేట్ నుండి గంజాయిని తెచ్చి చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చి నల్లగొండలోని యువకులు, విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ మేరకు నలుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐలు కే. సతీష్, బి. లచ్చిరెడ్డి, సిబ్బందిని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అభినందించారు.
2 కిలోల గంజాయి, రెండు బైక్‌లు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం


