వంగమర్తి రీచ్‌ నుంచి యథేచ్ఛగా తరలుతున్న ఇసుక | - | Sakshi
Sakshi News home page

వంగమర్తి రీచ్‌ నుంచి యథేచ్ఛగా తరలుతున్న ఇసుక

Mar 17 2026 7:28 AM | Updated on Mar 17 2026 7:28 AM

ముఖ్య నేతల కనుసన్నల్లోనే..

సాక్షి ప్రతినిధి నల్లగొండ : శాలిగౌరారం మండలంలోని వంగమర్తి గ్రామ పరిధిలో గల మూసీనది వద్ద ప్రభుత్వ అనుమతితో కొనసాగుతున్న ఇసుక క్వారీ అక్రమాలకు అడ్డాగా మారింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఇసుక క్వారీ నిర్వహణ ఉంది. మూసీ ప్రాజెక్టులో పూడిక తీసిన ఇసుకను తెలంగాణ రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీజీఎండీసీ) స్టాక్‌ పాయంట్‌కు తరలించకుండా నేరుగా ఇసుక పూడికతీత వద్దకే లారీలు, టిప్పర్లు వెళ్లి ఇసుకను లోడ్‌ చేసుకుని బయటికి వెళ్లిపోతున్నాయి. దీనివల్ల టీజీఎండీసీ ఇసుక స్టాక్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలేదు. ఇలా ప్రభుత్వ పనుల కోసమంటూ రోజుకు 60కు పైగా టిప్పర్ల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. దీంతో ప్రభుత్వం వద్ద ఇసుకను కొనుగోలు చేసే లారీలకు ఇసుక డీడీలు లభించడం అసాధ్యంగా మారింది. ఇంత జరుగుతున్నా టీజీఎండీసీ అధికారులు పట్టించుకోవడం లేదు.

2012 నుంచి ఇసుక క్వారీ..

మూసీ ప్రాజెక్టు పూడిపోతుండటంతో ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న శాలిగౌరారం మండలంలోని ఇటుకులపహాడ్‌, వంగమర్తి గ్రామాల పరిధిలో ఇసుక పూడికతీత(డీషిల్టింగ్‌)కు 2012లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతిచ్చింది. అప్పటి నుంచి మూసీ ప్రాజెక్టులో వంగమర్తి, ఇటుకులపహాడ్‌ పరిధిలో ఇసుకరీచ్‌(క్వారీ)లు ఏర్పాటు చేశారు. మూడునాలుగేళ్ల క్రితం ఇటుకులపహాడ్‌లో క్వారీ నిలిచిపోగా, వంగమర్తి క్వారీ కొనసాగుతోంది. వంగమర్తి క్వారీకి కూడా 2025 జూన్‌ 9 వరకే అనుమతి ఉండగా ప్రకృతి వైపరిత్యాల వల్ల నిర్ణీత కాలంలో ఇసుక పూడికతీత పనులు పూర్తికాలేదు. ఇంకా 3.25 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక(5.20 లక్షల మెట్రిక్‌ టన్నులు) పూడికతీత చేపట్టాల్సి ఉండటంతో ప్రభుత్వం సంబంధిత క్వారీ నిర్వాహణదారుడికి 2026 జూన్‌ 8 వరకు ఇసుక అనుమతి ఇచ్చింది. మూసీ ప్రాజెక్టు నుంచి పూడిక తీసిన ఇసుకను కాంట్రాక్టర్‌ క్వారీ వద్ద టీజీఎండీసీకి చెందిన స్టాక్‌ పాయింట్‌కు తరలించాలి. అక్కడ స్టాక్‌ అయిన ఇసుకను టీజీఎండీసీ ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

ప్రభుత్వ పనులకు కేటాయింపులు..

వంగమర్తి క్వారీ ఇసుకను ప్రభుత్వ పనుల కోసం కేటాయించింది. ఇందులో ప్రభుత్వం ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు మెట్రిక్‌ టన్ను ఇసుకను రూ.90కి ఇస్తుండగా, ఇందిరమ్మ ఇండ్లు, సాండ్‌ బజార్‌, ప్రభుత్వ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులతో పాటూ ప్రైవేట్‌ వ్యక్తులకు మెట్రిక్‌ టన్ను రూ.375లకు విక్రయిస్తుంది. ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు ఇసుకను తరలించే వాహనాలకు లోడింగ్‌ దగ్గర నుంచి అన్‌లోడింగ్‌ జరిగే వరకు ఎక్కడా పక్కదారి పట్టకుండా జీపీఎస్‌ సిస్టంను అమర్చడంతో పాటు సంబంధితశాఖకు చెందిన సిబ్బంది ఒకరు ఆ వాహనంలో వెళ్లే విధంగా ప్రణాళికలను రూపొందించారు. ఈ ప్రక్రియ మొత్తం టీజీఎండీసీ పర్యవేక్షణ ఉండాలి. కానీ ఇక్కడ ఇసుక పూడికతీత పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ తనతోపాటు తనకు సంబంధించిన మరో ఇద్దరు వ్యక్తుల పేరుతో 55 టిప్పర్లను కొనుగోలు చేసి ప్రభుత్వ పనుల పేరుతో టీజీఎండీసీ వద్ద ప్రభుత్వ నిర్ధేశిత ధరకు ఇసుకను కొనుగోలు చేసి బయటికి తరలిస్తున్నాడు.

ప్రభుత్వ పనుల పేరిట డీడీలు..

మైనింగ్‌ అధికారుల సహకారంతో ప్రభుత్వ పనుల పేరుతో డీడీలను పొందుతున్న కాంట్రాక్టర్‌ తన టిప్పర్లతో ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలకు ఇసుకను విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్థానిక ఇసుక లారీల యజమానులు అంటున్నారు. వంగమర్తి ఇసుకరీచ్‌ నుంచి కాంట్రాక్టర్‌ రోజుకు కనిష్టంగా 60 టిప్పర్ల ఇసుక(210 మెట్రిక్‌ టన్నులు) అక్రమంగా తరలిస్తున్నారని, దాని విలువ రోజుకు రూ.30 లక్షలకు పైమాటే ఉంటుందని చెబుతున్నారు. సంబంధిత అధికారులు కాంట్రాక్టర్‌కు సహకరిస్తుండడం వల్లే తాము ఇసుకను రవాణా చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో ఇండెంట్‌ లేకపోవడంతో డీడీలు దొరకక ఇబ్బందులు పడుతున్నామని మండలంలోని ఇసుక లారీల యజమానులు ఆరోపిస్తున్నారు.

వంగమర్తి ఇసుకరీచ్‌లో జరిగే అక్రమ రవాణా విషయం మండలస్థాయి నుంచి రాష్ట్ర ఉన్నతాధికారుల వరకు అందరి సహకారాలు ఉన్నట్లు బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంత కాకుండా స్థానిక, జిల్లా ‘ముఖ్య’ ప్రజాప్రతినిధులు, వీవీఐపీల సహకారాలు కూడా పుష్కలంగా ఉన్నట్లు తెలిసింది. వారంతా తమ వాటాలు పుచ్చుకునే అక్రమాలకు సహకరిస్తున్నారనేది బహిరంగ ఆరోపణ. వంగమర్తి ఇసుక రీచ్‌ నుంచి యథేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమ రవాణాపై ఇసుక లారీల యజమానులు, స్థానికులు ఇసుకరీచ్‌ వద్ద ఇటీవల వరుసగా రెండురోజుల పాటూ ఆందోళన చేపట్టడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement