నల్లగొండ : తెలంగాణ డీఈఈ సెట్ – 2026 డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌సీ) రెండు సంవత్సరాల కోర్సులకుగాను 2026–28 బ్యాచ్‌లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్లగొండ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ కారింగుల నర్సింహ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 15వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తు విధానం, ఫీజు, అర్హత తదితర వివరాలకు 8317567404 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని, http:deecet.cd-se.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.
హైకోర్టు న్యాయమూర్తికి స్వాగతం
నార్కట్‌పల్లి : హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్ భద్రాచలం పర్యటనకు వెళ్తూ సోమవారం నార్కట్‌పల్లిలో కాసేపు ఆగారు. ఆయనకు తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ ఉమేష్, ఆర్‌ఐ తరుణ్ మొక్క అందజేసి స్వాగతం పలికారు.
పోలీస్ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ
నల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్‌డే సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 30 మంది తమ భూ వివాదాలు, కుటుంబ కలహాలు, మోసాలకు సంబంధించిన సమస్యలను ఎస్పీకి విన్నవించారు. వినతులు స్వీకరించిన ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులు ఆయా సమస్యను వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉపాధి హామీ చట్టంలో మార్పును సహించం
చిట్యాల : ఉపాధిహామీ చట్టంలో మార్పులను సహించేది లేదని, పాత చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని వనిపాకల, వట్టిమర్తి, నేరడతో పాటు పలు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధిహామీ పని ప్రదేశాలను కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనర్సింహతో కలిసి ఆయన సందర్శించారు. కూలీతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఉపాధి హక్కులను కాలరాస్తూ, పంచాయతీలకు లభించిన అధికారాలను నిర్వీర్యం చేస్తోందన్నారు. ఆయన వెంట వనిపాకల సర్పంచ్ కొడేటి మహిపాల్‌రెడ్డి, ఉపసర్పంచ్ బద్దల లింగస్వామి, మాజీ ఎంపీపీ ఐలేష్, మల్లేష్, మేడి నర్సింహ, ఎల్ల వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు మేడి శ్రీలత, మిర్యాల వెంకటేశం, ఉపసర్పంచ్ మహేందర్, దుబ్బాక రజనీకాంత్‌రెడ్డి, గాలిబ్, కృష్ణయ్య, కొండ వెంకన్న ఉన్నారు.


