మహిళలు ఆర్థికంగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

Mar 15 2026 5:02 AM | Updated on Mar 15 2026 5:02 AM

నల్లగొండ : మహిళలు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని సెట్విన్‌ సంస్థలో శిక్షణ పొందిన 116 మంది మహిళలకు కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి పొందాలన్నారు. సెట్విన్‌ సంస్థ ద్వారా ఇప్పటివరకు 27 కోర్సుల్లో 1250 మందికి శిక్షణ ఇచ్చారని.. శిక్షణ పొందిన మహిళలు సంఘాలుగా ఏర్పడితే ప్రభుత్వం ద్వారా రుణాలు ఇప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కలెక్టరేట్‌ వద్ద న్యాక్‌ శిక్షణ సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా శిక్షణ ఇస్తున్నామన్నారు. ఎలక్ట్రిషియన్‌, ప్లంబర్‌ తదితర కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. కంప్యూటర్‌ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలను ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్లుగా నియమిస్తామన్నారు.

మూసీ ప్రక్షాళనకు టెండర్లు పిలుస్తాం..

మూసీ కాలుష్యం వల్ల భూగర్భ జలాలు కలుషితమై జిల్లాలోని 30 లక్షల మంది ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం మొదటి దశలో 21 కిలోమీటర్లు, రెండవ దశలో మరో 21 కిలోమీటర్లు మూసీ ప్రక్షాళనకు టెండర్లు పిలుస్తుందన్నారు. గతంలో చెప్పిన ప్రకారం డిండి ప్రాజెక్టు టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిని.. ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. సెట్విన్‌ చైర్మన్‌ గిరిధర్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌కే మాత్రమే పరిమితమైన సెట్విన్‌ను జిల్లాలకు విస్తరించామని, ప్రతి సంవత్సరం 25,000 మందికి శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. నల్లగొండ మేయర్‌ బుర్రి చైతన్య మాట్లాడుతూ మహిళలు ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక కోర్సులో శిక్షణ పొందాలని పేర్కొన్నారు. కలెక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు స్వయం ఉపాధి చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో సెట్విన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఉపేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ హఫీజ్‌ఖాన్‌, డిప్యూటీ మేయర్‌ అమీర్‌అలీ, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ అశోక్‌రెడ్డి, సెట్విన్‌ ప్రిన్సిపాల్‌ రేణుక పాల్గొన్నారు.

ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఫ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement