చిట్యాల : చేతికొచ్చే దశలో వరి వాడు పడుతున్నాయి. బోర్లు వట్టిపోవడంతో పంటలకు నీరు అందడం లేదు. దీంతో పొట్టదశకొచ్చిన వరి చేలను కాపాడుకునేందుకు రైతులు పాట్లు పడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా వరి చేలకు నీటిని అందిస్తున్నారు. ఈ పరిస్థితి చిట్యాల మండలం తాళ్లవెల్లెంలలో నెలకొంది. గ్రామానికి చెందిన పలువురు రైతులు చేతికొచ్చే దశలో బోరు ఎండిపోవడంతో ఏం చేయాలో పాలుపోక ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా నీరు అందిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ నీటికి రూ.వెయ్యి చెల్లిస్తున్నారు. అయినా పంటకు నీరు సరిపోక ఎండిపోతోంది. ఈ దశలో పంట ఎండిపోతే అప్పుల పాలు అవుతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు ద్వారా తమ గ్రామానికి సాగునీరు అందిస్తే.. భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు చెబుతున్నారు. ఎండిన పంటలకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.


