మునుగోడు : బి.వెల్లెంల ఉదయసముద్రం ప్రాజెక్టు నీటితో మునుగోడు మండల వ్యాప్తంగా ఉన్న చెరువులను వెంటనే నింపాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. గురువారం ఆయన మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించి మాట్లాడారు. కల్వలపల్లిలో ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్ల ద్వారా నీరు పారిస్తుంటే కండ్లలో నీళ్లు వస్తున్నాయన్నారు. 7–ఆర్ కాల్వ పనులు నేటికి ప్రారంభించకపోవడం వల్లే ఇక్కడి రైతులు నీటి కష్టాలు తప్పడం లేదన్నారు. 36 ఎకరాల భూసేకరణ చేపట్టినా కాల్వను ఎందుకు తవ్వించడం లేదని ప్రశ్నించారు. కిష్టాపురం చెరువు వరకు కాల్వ నిర్మాణం చేపట్టి మునుగోడు, నల్లగొండ మండలాల్లోని చెరువులను నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదిర్శ గుర్జ రామచంద్రం, సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, సీపీఎం మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, నాయకులు గట్టుపల్లి నర్సిరెడ్డి, బొల్గూరి నర్సింహ, తిరిపారి వెంకటేశ్వర్లు, సురిగి చలపతి పాల్గొన్నారు.


