గూడెం నుంచి పట్టణం | - | Sakshi
Sakshi News home page

గూడెం నుంచి పట్టణం

Jan 31 2026 10:50 AM | Updated on Jan 31 2026 10:50 AM

గూడెం నుంచి పట్టణం

గూడెం నుంచి పట్టణం

మున్సిపల్‌ చైర్మన్లుగా భార్యాభర్తలు

మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఓటర్ల వివరాలు

మిర్యాలగూడకు ఆసియాలోనే గుర్తింపు

1984 నుంచి మున్సిపాలిటీ

రాజకీయ చైతన్యం కలిగిన పట్టణం

మిర్యాలగూడ, మిర్యాలగూడ టౌన్‌ : ఒకప్పుడు చిన్న గూడెంగా ఉన్న మిర్యాలగూడ నేడు దేశ, విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. రాజకీయంగానూ చైతన్యవంతమైన ప్రాంతంగా పేరుగాంచింది. మిర్యాలగూడెం 1956లో గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. 1983లో మేజర్‌ గ్రామ పంచాయతీగా మారింది. ప్రస్తుతం 34 వార్డులతో కూడిన గ్రేడ్‌–1 మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. మిర్యాలగూడలో ఆసియాలోనే అత్యధిక రైస్‌ మిల్లులు ఉండి దేశ, విదేశాలకు బియ్యాన్ని సరఫరా చేస్తున్నది.

రైస్‌ ఇండస్ట్రీస్‌ హబ్‌గా..

మిర్యాలగూడ రైస్‌ మిల్లుల ఏర్పాటులో ఆసియాలోనే రెండవ స్థానంలో నిలిచి రైస్‌ ఇండస్ట్రీస్‌ హబ్‌గా పేరు పొందింది. మిర్యాలగూడ పట్టణ పరిధిలో 50, పరిసర ప్రాంతాల్లో మరో 40 రైస్‌ మిల్లులు ఉన్నాయి. నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ కింద సాగైన వరి పంటతో సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి ప్రాంతాల్లో సాగైన వరి ధాన్యాన్ని మిర్యాలగూడలోని రైస్‌ మిల్లులకు తీసుకొస్తారు. ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ధాన్యాన్ని ఇక్కడి మిల్లర్లు సేకరించి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలతోపాటు వేరే దేశాలకూ ఎగుమతి చేస్తున్నారు.

గ్రేడ్‌–1 మున్సిపాలిటీగా..

మేజర్‌ గ్రామపంచాయతీగా ఉన్న మిర్యాలగూడ 1984లో 22 వార్డులతో గ్రేడ్‌–3 మున్సిపాలిటీగా ఏర్పాటైంది. పట్టణ జనాభా పెరగడంతో 1989లో వార్డుల సంఖ్యను 28కు పెంచి గ్రేడ్‌–2 మున్సిపాలిటీగా మార్చారు. 2005లో చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కలిపి 36 వార్డులతో గ్రేడ్‌–1 మున్సిపాలిటీని చేశారు. వార్డుల పునర్విభజన అనంతరం ప్రస్తుతం 48 వార్డులకు పెంచారు.

ఆరుగురు చైర్మన్లు

1984లో మిర్యాలగూడ మున్సిపాలిటీగా ఏర్పాటైనప్పటికీ మూడేళ్ల పాటు ప్రత్యేకాధికారి పాలనలోనే కొనసాగింది. 1987 మొదటి సారి ఎన్నికలు జరిగాయి. నేటి వరకు మున్సిపల్‌ చైర్మన్లుగా మొత్తం ఆరుగురు పనిచేశారు. రెండు పర్యాయాలు సీపీఎం పొత్తుతో టీడీపీ చైర్మన్‌ స్థానం కై వసం చేసుకోగా మూడోసారి సీపీఎం, కాంగ్రెస్‌, టీడీపీ పార్టీల అభ్యర్థులు వేర్వేరుగా పోటీ చేశారు. దాంతో మూడవసారి సైతం టీడీపీ చైర్మన్‌ స్థానం కై వసం చేసుకుంది. ఒకసారి బీఆర్‌ఎస్‌, రెండు సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థి చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

రెండోసారి మహిళకు రిజర్వ్‌

మిర్యాలగూడ మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి ఆరు పర్యాయాలు ఎన్నికలు జరగగా మున్సిపల్‌ చైర్మన్‌స్థానం రెండుసార్లు మహిళకు రిజర్వ్‌ అయ్యింది. తొలి సారి ఎస్టీ జనరల్‌, కాగా రెండవ, మూడవ సారి జనరల్‌, నాలుగవ పర్యాయం బీసీ జనరల్‌, ఐదవ పర్యాయం జనరల్‌ మహిళగా రిజర్వ్‌ అయ్యింది. ప్రస్తుతం కూడా జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయ్యింది.

మిర్యాలగూడ మున్సిపాలిటీకి 2014లో జరిగిన ఎన్నికల్లో చైర్మన్‌ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావడంతో కాంగ్రెస్‌ నుంచి 46వ వార్డు అభ్యర్థిగా విజయం సాధించిన తిరునగరు నాగలక్ష్మీభార్గవ్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆ తరువాత ఆమె బీఆర్‌ఎస్‌లోకి మారారు. 2019లో మున్సిపల్‌ చైర్మన్‌ స్థానం జనరల్‌గా రిజర్వ్‌ కాగా బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన 36వ వార్డు కౌన్సిలర్‌ తిరునగరు భార్గవ్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఆయన కూడా కాంగ్రెస్‌లోకి మారారు. భార్యాభర్తలిద్దరూ మున్సిపల్‌ చైర్మన్‌లుగా ఎన్నికై అరుదైన ఘనత సాధించారు.

మొత్తం పురుషులు మహిళలు ఇతరులు

93,020 45,128 47,878 14

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement