పూర్వగిరీశుడు పెళ్లి కొడుకాయనే..
యాదగిరిగుట్ట: పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం మూడవ రోజుకు చేరాయి. ఆలయంలో హవన పూజలు నిర్వహించి, అలంకార వాహన సేవలకు శ్రీకారం చుట్టారు. రాత్రి శ్రీస్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు మహోత్సవం జరిపించారు. వేడుకల్లో ఆలయ ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు, ఉపప్రధానార్చకులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం నుంచే యాగశాలలో ఆరాధన, నిత్య పూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం అలంకార సేవలు నిర్వహిఆంచారు. శ్రీస్వామి అమ్మవార్లను సింహవాహనం పై అధిష్టింపజేసి హారతినిచ్చారు. ఆలయ ముఖ మండపంలో శ్రీస్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు.
తిరు కల్యాణానికి ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి 8గంటలకు గజవాహనం చేపట్టి శ్రీస్వామి అమ్మవార్ల తిరు కల్యాణ వేడుకలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8గంటలకు హవనం, తిరుమంజనోత్సవం, హనుమంత సేవ నిర్వహించనున్నారు.
● నృసింహుడి ఆలయ ముఖ మండపంలో
వైభవంగా ఎదుర్కోలు మహోత్సవం
● నేడు స్వామి అమ్మవార్ల తిరు కల్యాణోత్సవం


