మున్సిపాలిటీల్లో బీసీలకు 42 శాతం టికెట్లు
సాక్షి, యాదాద్రి, ఆలేరు రూరల్ : మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా బీసీలకు కాంగ్రెస్ పార్టీ 42 శాతం టికెట్లు ఇస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును కేంద్ర ప్రభుత్వం తొలగించడంపట్ల శుక్రవారం ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో ీఉపాధి హామీ కూలీలతో కలిసి నిరసన చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న రాహుల్‌గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్‌రెడ్డి చట్టం చేశారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని తొక్కిపెట్టిందని ఆరోపించారు. గాంధీ పేరు తొలగించి దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తుందన్నారు. ఎన్నికల రాగానే హిందూ ముస్లింల మధ్యన లడాయి పెట్టి అధికారంలోకి రావాలని చూస్తుందన్నారు. హిందువులందరూ ఆరాదించే శ్రీరాముడికి బీజేపీలో ఏమైనా సభ్యత్వం ఉందా అని ప్రశ్నించారు. పేద ప్రజల కడుపుకొట్టే ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎంపీ కిరణ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో వంద శాతం నిధులు వెచ్చిస్తూ పథకాన్ని అమలు చేసిన కేంద్రం ప్రభుత్వం, ఇప్పుడు తన వాటాను 60శాతం తగ్గించి, మిగిలిన 40శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యాయమన్నారు. ప్రభుత్వ విప్, భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య అధ్యక్షతన నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మహిళా అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్‌గౌడ్, అండెం సంజీవరెడ్డి, జనగాం ఉపేందర్‌రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఐనాల చైతన్య, సర్పంచ్ సిరిమర్తి రేణుక తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ కూలీలకు అత్మగౌరవం కల్పించింది కాంగ్రెస్సే
పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్


