నీలగిరిలో తీర్పు ఆమెదే!
24 డివిజన్లలో మహిళలే పోటీ..
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. కార్పొరేషన్‌లోని 48 వార్డు డివిజన్లు ఉండగా 46 డివిజన్లలో వారిదే పైచేయిగా ఉంది. అధికారులు ప్రకటించిన ఓటరు జాబితా ప్రకారం కార్పొరేషన్ పరిధిలోని 48 వార్డుల్లో మొత్తం 1,42,437 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 73,507 మంది ఉండగా, పురుషులు 68,874, ఇతరులు 56 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కన్నా.. 4,633 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 48 డివిజన్లకు గాను 33వ డివిజన్, 34వ డివిజన్‌లో మాత్రమే పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మిగతా 46 డివిజన్లలో మహిళామణులే అభ్యర్థుల గెలుపోటములను శాసించనున్నారు.
మహిళా ఓటర్లపై అభ్యర్థుల దృష్టి..
నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్‌పై ఏ పార్టీ జెండా ఎగురవేయాలన్నా మహిళా ఓటర్లపైనే ఆధారపడి ఉంటుంది. తొలిసారి నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు కావడంతో మేయర్ పదవి దక్కించుకొవడానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల డివిజన్లలో పోటీ చేసేందుకు సామాజికంగా, ఆర్థికంగా బలమైన అభ్యర్థులను నిలబెడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఇప్పటికే పలువురికి టికెట్ ఓకే అని చెప్పడంతో వారు ఆయా డివిజన్లలో కాలనీల్లో ఇల్లిల్లూ తిరుగుతున్నారు. కాలనీల్లోని మహిళలు, యువత, పెద్ద మనుషులను, కుల సంఘాల నాయకులను కలుస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తనను గెలిపిస్తే ఉపాధి కోసం రుణ సౌకర్యం కల్పిస్తామని హామీలు గుప్పిస్తున్నట్లు తెలిసింది. మహిళా ఓటర్లకు తాయిలాలు సైతం అందించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
ఫ 48 డివిజన్లలో..
46 చోట్ల మహిళా ఓటర్లే అధికం
ఫ గెలుపోటములను శాసించనున్న నారీమణులు
ఫ మహిళా ఓటర్లపై అభ్యర్థుల ఫోకస్
ఫ ప్రత్యేకంగా తాయిలాలు ఇచ్చి
ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు
కార్పొరేషన్‌లో 48 డివిజన్లు ఉండగా 24 డివిజన్లు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. కాగా ఎస్సీ మహిళలకు 3 డివిజన్లు, బీసీ మహిళలకు 08, జనరల్ మహిళలకు 13 డివిజన్లు రిజర్వేషన్ల కింద కేటాయించారు. మహిళలు పోటీ చేసే డివిజన్లలో కూడా గెలుపులో మహిళా ఓటర్లే ప్రాధాన పాత్ర అవుతుంది. దాంతో మహిళా అభ్యర్థులు కూడా మహిళలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.


