నియోజకవర్గంలోనే యూరియా బుకింగ్
ఫర్టిలైజర్ యాప్‌లో స్వల్ప మార్పులు చేసిన వ్యవసాయ శాఖ
నల్లగొండ అగ్రికల్చర్ : రైతుల ఇబ్బందులను తీర్చేందుకు వ్యవసాయ శాఖ నియోజకవర్గ స్థాయిలోనే ప్రత్యేక యాప్‌లో యూరియా బుకింగ్ చేసుకునేలా అవకాశం కల్పించింది. ఇందుకోసం ఇప్పుడున్న యాప్‌లో స్వల్ప మార్పులు చేర్పులు చేసింది. దీంతో నియోజకవర్గ పరిధి యాప్‌లోనే యూరియా బుక్ చేసుకునేలా శనివారం నుంచి కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది.
ఇప్పటి వరకు ఇలా..
ఇప్పటి వరకు జిల్లా ఫర్టిలైజర్ యాప్ ద్వారా రైతులు యూరియాను బుక్ చేసుకునే అవకాశం ఉంది. రైతులు జిల్లాలోని ఏప్రాంతం నుంచైనా ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకుని ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్లి కొనుగోలు చేసుకునేవారు. గతేడాది డిసెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చిన ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకు 1,28,475 మంది రైతులు 4,38,529యూరియా బస్తాలను కొనుగోలు చేశారు. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో యూరియా అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల దొరికినప్పటికీ దాన్ని తెచ్చుకునేందుకు ప్రయాణ కష్టాలు తప్పలేదు. యూరియా బుకింగ్ యాప్ వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను తెసుకున్న జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు నియోజకవర్గ స్థాయిలోనే యూరియా బుక్ చేసుకునేలా యాప్‌ను మార్చాలని కోరారు. దీంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ నియోజకవర్గ స్థాయిలోనే యూరియాను బుక్ చేసుకునేలా యాప్‌లో మార్పులు చేసి అందుబాటులోకి తెచ్చింది.
రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లోనే యాప్..
గత వానాకాలం సీజన్‌లో యూరియా కోసం రైతులు పడ్డ ఇబ్బందులు, రోజులకొద్ది క్యూలైన్లు, రాత్రింబవళ్లు యూరియా కోసం రైతులు పడిగాపులు కాసిన విషయం తెలిసిందే. దీంతోపాటు యూరియాను రైతులు ఎక్కువ మోతాదులో వినియోగిస్తున్న నేపథ్యంలో యూరియా కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం యూరియా బుకింగ్‌కు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించిన అమలులోకి తెచ్చింది. ఎకరాకు రెండు బస్తాల చొప్పున రెండు ధఫాలలో అందిస్తున్నారు. రాష్ట్రంలోని అదిలాబాద్, జనగాం, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో మాత్రమే ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను అమలు చేస్తున్నారు. అయితే మిగతా మూడు జిల్లాల్లో జిల్లా యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకుంటున్నప్పటికి నల్లగొండ జిల్లాలో మాత్రం నియోజకవర్గ స్థాయి యాప్‌లో మాత్రమే యూరియాను బుక్ చేసుకునేలా అందుబాటులోకి తెచ్చారు. దీంతో జిల్లా వ్యవసాయ శాఖ ఆయా నియోజకవర్గాల్లో వరిసాగు, డిమాండ్‌ను బట్టి యూరియాను అందుబాటులో ఉంచారు. ఫలితంగా జిల్లాలోని ఏ నియోజకవర్గంలోని దుకాణాల్లో ఆ ప్రాంత రైతులు యూరియాను బుకింగ్ చేసుకుని కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. దీంతో రైతులకు దూరభారంతో పాటు రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.
ఫ జిల్లాలో శనివారం నుంచి అమలు
ఫ ట్రాన్స్‌పోర్ట్ భారం తగ్గించేందుకు కొత్త యాప్
ఫ ఇప్పటికే 4,38,529 బస్తాల యూరియా కొన్న రైతులు


