ఉత్తమ్ ఇలాఖాలో పోలీస్‌రాజ్యం
కోదాడ: కోదాడ నియోజకవర్గంలో పోలీసు రాజ్యం నడుస్తుందని, సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి ఖాకీ చొక్కాలు వేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులుగా పెట్టుకొని అకారణంగా దళిత యువకుడిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. కోదాడకు చెందిన కర్ల రాజేష్ మృతి ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం బొల్లం మల్లయ్యయాదవ్ ఆధ్వర్యంలో చలో కోదాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన నిరసన ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. రాజేష్ మరణానికి కారణమైన పోలీసులు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కావడంతో మంత్రి, ఎమ్మెల్యే వారిని కాపాడుతున్నారని ఆరోపించారు. జిల్లా ఎస్పీ దీనిపై ఇంత వరకు నోరు విప్పలేదని, దీనికి కారణమైన అప్పటి కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డిని మంత్రి తన శాఖలో నియమించుకోవడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. రాజేష్ తల్లి పడుతున్న ఆవేదన మంత్రి, ఎమ్మెల్యేలకు అర్ధం కావడం లేదన్నారు. న్యాయం కోసం మందకృష్ణ మాదిగ 60 రోజులుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. టూరిస్టుల వలె నియోజకవర్గాలకు వచ్చిపోతున్న ఉత్తమ్ దంపతుల వల్ల కోదాడలో మండలానికి ఒక షాడో ఎమ్మెల్యే పెత్తనం చేస్తున్నాడని పేర్కొన్నారు. పోలీసులు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను టార్గెట్‌గా చేసుకొని ఇబ్బంది పెడుతున్నారని, తమ ప్రభుత్వం వచ్చిన తరువాత మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్‌ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పైడి రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అవినీతి మయంగా మారిందని, పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కర్ల రాజేష్ తల్లి లలితమ్మ, కోదాడ మాజీ ఎంపీపీ చింతా కవిత, కోదాడ పట్టణ బీఆర్‌ఎస్ అద్యక్షుడు ఎస్.కె.నయీం, పి.సత్యబాబు, సుంకర అజయ్‌కుమార్, తుమ్మలపల్లి భాస్కర్, కర్ల సుంధర్‌బాబు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఫ కోదాడ మాజీ ఎమ్మెల్యే
బొల్లం మల్లయ్యయాదవ్ ఆరోపణ


