క్రీడా స్ఫూర్తిని పెంచేందుకే ‘సంసద్ ఖేల్’
నార్కట్‌పల్లి : యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకే కేంద్ర ప్రభుత్వం సంసద్ ఖేల్ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. శనివారం నార్కట్‌పల్లి మండలం నెమ్మానిలో జరుగుతున్న సంసద్ ఖేల్ క్రీడాపోటీలను ఆయన వీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. సింగరేణి కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు టీవీ సీరియల్ లాగా సాగదీస్తూ దర్యాప్తులు జరుపుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో సంసద్ ఖేల్ మహోత్సవ్ రాష్ట్ర ఇన్‌చార్జి గంగిడి మనోహార్‌రెడ్డి, బీజేపీ నకిరేకల్ కన్వీనర్ పజ్జూర్ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, మొగులయ్య, శ్రీదేవిరెడ్డి, మెడబోయిన శ్రీనివాస్, బి.శ్రీకాంత్ పాల్గొన్నారు.
గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం
చిట్యాల : గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. చిట్యాల పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి సంసద్ వాలీబాల్ క్రీడా పోటీలను శనివారం ఆయన పరిశీలించారు. క్రీడాకారులతో కలిసి కాసేపు వాలీబాల్ ఆడారు. ఆనంతరం ఆయన మాట్లాడారు. ఆయన వెంట బీజేపీకి చెందిన పలువురు నాయకులు ఉన్నారు.
ఫ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్


