జీవాలకు ‘అమ్మతల్లి’ నిరోధక టీకాలు
టీకాలు వేయించాలి
నల్లగొండ అగ్రికల్చర్ : జీవాలలో అమ్మతల్లి వ్యాధిని అరికట్టేందుకు జిల్లా పశుసంవర్ధక, పశువైద్య శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ నెల 8న అమ్మతల్లి వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 78 వైద్య బృందాలను ఏర్పాటు చేసి టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే జిల్లాలో 10లక్షల గొర్రెలు, 3లక్షల వరకు మేకలు ఉన్నాయి. వీటిలో మూడో వంతు జీవాలకు టీకాలు వేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. వైద్యబృందాలు పెంపకందారులు ఇంటికి వెళ్లి ఇప్పటి వరకు 8లక్షల జీవాలకు టీకాలు వేశారు. ఈ నెలాఖరు వరకు నిర్దేశించిన లక్ష్యం పూర్తిచేసేందుకు యంత్రాంగం ముందుకెళ్తోంది.
వ్యాధి వ్యాప్తికి కారణం..
ఈ వ్యాధి కాప్రిపాక్స్ వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది. ముక్కు, కళ్ల స్రావాల ద్వారా మేత పాత్రలు, నీటితొట్టెలు, పనివాళ్ల చేతులు శుభ్రంగా లేకపోవడం, ఈగలు, కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
వ్యాధి లక్షణాలు..
జీవాలలో 104 నుంచి 106 డిగ్రీల వరకు జ్వరం ఉండి మేత మేయకుండా నీరసించి పోతాయి. ముక్కు, కళ్ల నుంచి నీరు కారడంతో పాటు నోటిపెదాలు వాపుగా ఉంటాయి. వ్యాధి తీవ్రత పెరిగి మరణాలు సంభవించే ప్రమాదం ఉంటుంది.
జీవాల పెంపకందారులు తమ జీవాలకు ప్రభుత్వం ఉచితంగా వేస్తున్న అమ్మతల్లి వ్యాధి నిరోధక టీకాలను వేయించాలి. సిబ్బంది ఉదయమే గ్రామాలకు వస్తున్నందున సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
–డాక్టర్ జీవీ.రమేష్,
జేడీ జిల్లా పశుససంవర్ధక, పశువైద్య శాఖ
ఫ జిల్లాలో ముమ్మరంగా వ్యాక్సినేషన్
ఫ ఇప్పటికే 8లక్షల జీవాలకు పూర్తి
ఫ నెలాఖరు వరకు టీకాలు


