లింగంపల్లిలో ప్రశాంతంగా పోలింగ్
నూతనకల్ : నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామస్తులు గురువారం ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు ఉప్పుల మల్లయ్య రెండు రోజుల క్రితం హత్యకు గురికావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. అయితే ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సూర్యాపేట ఎస్పీ నరసింహ నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించడంతో ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
14 నుంచి క్రీడలు
ఆలేరు : మేరా యువభారత్ సౌజన్యంతో ఈ నెల 14, 15 తేదీల్లో ఆలేరులో బ్లాక్‌స్థాయి క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు ఆలేరు ఫ్రెండ్స్‌క్లబ్ అధ్యక్షుడు పూల నాగయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలురకు కబడ్డీ, షటిల్, 100 మీటర్ల రన్నింగ్, బాలికలకు టగ్‌ఆఫ్ వార్, షటిల్, 100 మీటర్ల రన్నింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన బాలబాలికలు ఆదివారం ఉదయం 10 గంటల లోపు స్థానిక ఫ్రెండ్స్‌క్లబ్ వద్ద హాజరు కావాలని కోరారు.


