రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
చౌటుప్పల్ : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం దామెర గ్రామ శివారులో గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన వీరమళ్ల నరేష్(30) చౌటుప్పల్‌లోని ఓ షోరూమ్‌లో ప్రైవేట్ ఫైనాన్స్ లోన్ రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తున్నాడు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన సుక్క పేరిరాజు తంగడపల్లి చౌరస్తా వద్ద నరేష్‌ను లిఫ్ట్ అడగడంతో అతడిని బైక్‌పై ఎక్కించుకున్నాడు. ఇద్దరూ కలిసి వెళ్తుండగా.. దామెర గ్రామ శివారులోని వెంచర్ వద్ద ద్విచక్ర వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో బైక్ నడుపుతున్న నరేష్ తలకు బలమైన గాయాలయ్యాయి. అతడిని స్థానికులు ద్విచక్ర వాహనంపై చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బైక్ వెనుక కూర్చున్న పేరిరాజు కాలు విరిగింది. అతడిని కూడా ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, తమకు ఫిర్యాదు సైతం అందలేదని సీఐ మన్మథకుమార్ తెలిపారు.


